- వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన దాసరి దామోదర్ 1981లో ఉపాధి కోసం అహ్మదాబాద్‌కు తరలివెళ్లి అక్కడ వస్త్ర పరిశ్రమలో చేరారు. క్రమేపీ పారిశ్రామికవేత్త స్థాయికి ఎదిగాడు. మూడున్నర దశాబ్దాల తర్వాత తెలంగాణలో స్థిరపడేందుకు వస్తున్నారు. కాకతీయ జౌళి పార్కులో ప్రభుత్వం కేటాయించిన భూమిలో పరిశ్రమను స్థాపించనున్నారు.
- చిలుక రాజేశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా షాబాజ్‌పల్లి నుంచి ఇరవై ఏళ్ల క్రితం సోలాపూర్ వెళ్లారు. అక్కడ కార్మికునిగా పనిచేసి, క్రమేపీ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఇప్పుడు జనగామ జిల్లా కల్లెంలోని జౌళి పార్కులో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు.
- పెద్దపల్లి నుంచి భివాండికి వలస వెళ్లిన సాంబయ్య.. భారీ జౌళి సంస్థలో పనిచేస్తున్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్న అపారెల్ పార్కులో తాను పరిశ్రమ స్థాపించేందుకు ముందుకొచ్చారు.
- సూరత్‌లోని ప్రవాస తెలంగాణ పారిశ్రామికుడు స్వామి.. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు హనుమకొండ జిల్లా మడికొండలో జౌళి పార్కులో పరిశ్రమకు శ్రీకారం చుట్టారు.
Industries in Handloom and Textile Parks: దశాబ్దాల క్రితం మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు వలస వెళ్లిన నేతన్నలు క్రమంగా రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటవుతున్న జౌళి, మరమగ్గాల పార్కుల్లో భాగస్వాములవుతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లినవారిని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. భూములు కేటాయిస్తోంది. రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. సూరత్.. భివాండి.. సోలాపూర్, అహ్మదాబాద్, ముంబయి దేశంలోనే జౌళి, వస్త్ర పరిశ్రమకు పేరొందాయి. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం తెలంగాణలో నెలకొన్న దుర్భర పరిస్థితుల దృష్ట్యా ఉపాధి కోసం వేల నేత కుటుంబాలు అక్కడికి వలస వెళ్లాయి. క్రమేపీ వారంతా అక్కడే స్థిరపడ్డారు. సూరత్‌లో ఆరు లక్షలు, సోలాపూర్‌లో నాలుగు లక్షలు, భివాండిలో రెండు లక్షలు, అహ్మదాబాద్‌లో లక్ష మంది వరకు ఉన్నారు. కాలక్రమంలో కొందరు సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్రంలో చేనేత, జౌళి రంగాలకు ఊతమిచ్చేందుకు భారీగా పార్కుల ఏర్పాటుకు పూనుకుంది. ఇతర రాష్ట్రాల పరిస్థితుల అధ్యయనం చేసేందుకు మంత్రులు, అధికారులు అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ స్థిరపడిన తెలంగాణ పారిశ్రామికవేత్తలు, కార్మికులతో భేటీ అయ్యారు. వారిలో కొందరు పరిశ్రమలను స్థాపిస్తామని సంసిద్ధత వ్యక్తంచేశారు. చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీ రామారావు వారికి కొత్త పార్కుల్లో ప్రత్యేకంగా స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లోని పారిశ్రామికులు సొసైటీలుగా ఏర్పడి తెలంగాణ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ)లో దరఖాస్తు చేసుకున్నారు.
మాతృ రాష్ట్రంలో పరిశ్రమలు
- వరంగల్ జిల్లా శాయంపేట-చింతపల్లి గ్రామాల మధ్య నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం 1200 ఎకరాల్లో కాకతీయ జౌళి పార్కును ఏర్పాటు చేసింది. సూరత్‌లోని తెలంగాణ నేత పారిశ్రామికులు 500 మంది దుర్గాశక్తి సొసైటీగా ఏర్పడగా.. ప్రభుత్వం వారికి 135 ఎకరాలను కేటాయించింది. దీనికి సంబంధించిన పత్రాలను ఇటీవల అందజేసింది. వారు ఇక్కడ నేత, దుస్తులు, ఎంబ్రాయిడరీ వంటివి తయారు చేయనున్నారు. 20 వేల మందికి వీటివల్ల ఉపాధి లభిస్తుంది.
- జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కల్లెంలో రాష్ట్ర ప్రభుత్వం జౌళి పార్కును మంజూరు చేసింది. సోలాపూర్‌లోని 500 నేత కుటుంబాలవారు ఇక్కడ పరిశ్రమల స్థాపనకు సంసిద్ధత వ్యక్తంచేశారు. సోలాపూర్ ప్రవాస తెలంగాణ జౌళి పరిశ్రమల సంఘం పేరిట ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా.. 550 చిన్న పరిశ్రమలకు స్థలాలను కేటాయించింది. ఒక్కో పారిశ్రామికవేత్త రూ. కోటి నుంచి కోటిన్నర వరకు పెట్టుబడి పెట్టి పదివేల మందికి ఉపాధి కల్పించనున్నారు.
- హనుమకొండ జిల్లా మడికొండలో 161 ఎకరాల్లో జౌళి పార్కు ఏర్పాటైంది. ఇందులో 60 ఎకరాలను సూరత్, ముంబయి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 160 మంది కార్మికుల మరమగ్గాలకు కేటాయించారు. దీని ద్వారా 5 వేల మందికి ప్రత్యక్ష ఉపాధిని నిర్దేశించారు.
- సిరిసిల్లలో 68 ఎకరాల్లో అపారెల్ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో దాదాపు 69 మంది భివాండి తదితర ప్రాంతాల్లోని పారిశ్రామికులకు స్థలం కేటాయించింది.
- సూరత్ పారిశ్రామికులు చీరల తయారీని చేపట్టనుండగా.. సోలాపూర్ నుంచి వచ్చిన వారు టర్కీ టవళ్లు, దుప్పట్లు తయారు చేస్తారు. భివాండి పారిశ్రామికులు సూటింగు, షర్టింగు ఉత్పత్తులు చేస్తారు.
మాతృభూమిపై ప్రేమతో...
మాది పరకాల మండలం కంఠాత్మకూర్ 1982లో సూరత్ వెళ్లి స్థిరపడ్డాం. మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో వరంగల్ జౌళి పార్కులో తలా రూ. కోటి నుంచి కోటిన్నరతో పరిశ్రమలు స్థాపించాలని నిర్ణయించాం. మాకు ప్రభుత్వం భారీఎత్తున భూములు కేటాయించడంతో పాటు మౌలిక వసతులు కల్పించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మేం ఇక్కడ స్థిరపడితే.. సూరత్‌లో అన్నీ అమ్మేసి ఇక్కడికే వస్తాం.
- మస్నా కుమారస్వామి, సూరత్ దుర్గాశక్తి టెక్స్‌టైల్స్ అధ్యక్షుడు
సొంతూరికి రావడం గర్వంగా ఉంది
అప్పుడు ఉత్తచేతులతో పని వెదుక్కుంటూ వెళ్లి ఇప్పుడు సొంత ఊరికి పారిశ్రామికవేత్తగా రావడం ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. ఇక్కడి వారికి ఉపాధిని కల్పించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాను.
- దాసరి దామోదర్, అహ్మదాబాద్‌లోని తెలంగాణ పారిశ్రామికవేత్త
ఇళ్లస్థలాలు ఇస్తే ఇక్కడే ఉంటాం
ఏకాభిప్రాయంతోనే ఇక్కడ పెట్టుబడులకు పెద్దఎత్తున వలస పారిశ్రామికులు ముందుకొస్తున్నారు. పరిశ్రమలకు సమీపంలో ఇళ్ల స్థలాలు ఇస్తే ఇక్కడే ఇళ్లు కట్టుకొని స్థిరపడతాం.
- చిలక రాజేశం, సోలాపూర్ ప్రవాస తెలంగాణ జౌళి పరిశ్రమల సంఘం
ఇదీ చూడండి: Employees Postings: నేడు జోనల్, బహుళ జోనల్ అధికారుల బదిలీలు..