Weather Report: రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ నేటి నుంచి మూడు రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే ఈ రోజు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో గంటకు 30నుంచి 40కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించారు. రేపు, ఎల్లుండి కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ రోజు ఉపరితల ద్రోణి విదర్భ నుంచి మరట్వాడ ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 900మీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతుందని వివరించారు.
ఉత్తర తెలంగాణలో ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఆదిలాబాద్ , కరీంనగర్ , నిజామాబాద్ జిల్లాల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అత్యవసరమైతే గానీ ఎండపూట ప్రజలు బయటికి రావొద్దని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దేశంలోని పరిస్థితి చూస్తే: తెలంగాణలోనే కాకుండా దేశంలో ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు బీభత్సంగా పెరిగిపోయాయి. అయితే, త్వరలో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు చేసింది.రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు 'ఆరెంజ్' హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. తర్వాతి నాలుగు రోజులు ఇక్కడ ఎండలు మండిపోతాయని తెలిపింది. వాయువ్య భారతంలో ప్రస్తుతం కంటే రెండు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండు రోజుల తర్వాత కూడా పరిస్థితులో మార్పు ఉండదని.. ఎండలు తీవ్రంగానే కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో సాధారణం కంటే 3.1 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయని ఐఎండీ లెక్కగట్టింది.
బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య భారత దేశంలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటే అవకాశం ఉందని హెచ్చరించింది. తీవ్రమైన ఎండల ఫలితంగా శిశువులు, వృద్ధులు, వ్యాధులు ఉన్న ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వీరంతా ఎండలో తిరగకపోవడమే మంచిదని సూచించింది. మార్చిలోనే ఎండలు భారీ స్థాయిలో నమోదయ్యాయి. సాధారణంగా ఈ కాలంలో కురిసే వర్షాలు సైతం కురవకపోవడం వల్ల.. ఉష్ణోగ్రతలపై ప్రభావం పడింది. 122ఏళ్ల క్రితం భారత వాతావరణ శాఖ ఉష్ణోగ్రతల రికార్డులను పొందుపర్చడం ప్రారంభించింది. ఆ తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన మార్చిగా గత నెల రికార్డు సాధించింది. ఈ ఏడాది మార్చిలో 71 శాతం వర్షాలు తక్కువగా కురిశాయి. దీంతో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండవేడిని తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్నారు. తమను తాము చల్లబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చదవండి: