ఉత్తర, వాయువ్య భారతం నుంచి తక్కువ ఎత్తులో పొడిగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో శని, ఆదివారాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉష్ణోగ్రత సాధారణం కన్నా 3 డిగ్రీలు అదనంగా పెరిగే సూచనలున్నాయి.
శుక్రవారం అత్యధికంగా జూలూరుపాడు(భద్రాద్రి జిల్లా)లో 43.8, నీల్వాయి(మంచిర్యాల)లో 43.5, అయిటిపాముల(నల్గొండ)లో 43.2 డిగ్రీలుంది. రాత్రివేళల్లోనూ 25 నుంచి 27 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్, నల్గొండలో గాలిలో తేమ సాధారణం కన్నా 30 శాతం తక్కువ ఉంటోంది. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అండమాన్ సముద్రం చుట్టుపక్కల అల్పపీడనం ఉంది.
రాష్ట్రంలో ఈ నెల ఏడోతేదీ వరకూ పొడి వాతావరణం.. అప్పటి నుంచి 15 వరకూ సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. వచ్చే వానాకాలం సీజన్(జులై) వరకూ హిందూ మహాసముద్రంపై ఉష్ణోగ్రతలు తటస్థంగా ఉంటాయని, సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసినట్లు నాగరత్న తెలిపారు.
ఇదీ చదవండి: '9-12 తరగతులకు సిలబస్ తగ్గించం'