సోమవారం నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై తమ పార్టీ గళాన్ని వినిపిస్తామని గోషామహల్ ఎమ్మెల్యే, భాజపా శాసన సభా పక్షనేత రాజా సింగ్ అన్నారు. రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా రైతుల పంట పొలాలు నీట మునిగాయని.. వారికి ఇవ్వాల్సిన నష్టపరిహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. గోషామహల్ నియోజకవర్గం గన్ ఫౌండ్రిలో భాజపా యువ నాయకుడు భీష్మ ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో... కొవిడ్ వారియర్స్‌ను సన్మానించిన కార్యక్రమంలో రాజా సింగ్ పాల్గొన్నారు.
'ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం'
వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఆశ వర్కర్లను, జలమండలి ఉద్యోగులను రాజాసింగ్ ఘనంగా సత్కరించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తామ మాట్లాడేందుకు రెండు, మూడు నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 15 అంశాలపై సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
'పగటి కలలు కంటున్నారు'
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రకటన రాకముందే తెరాస నాయకులు పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను దోచుకుంటున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు అసహనంతో ఉన్నారని తెలిపారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలే అధికార తెరాసకు గుణపాఠం చెప్తారని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.