ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అసెంబ్లీ వేదికగా గట్టిగా నిలదీయనున్నట్లు కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సోమవారం నుంచి శాసనసభ సమావేశాల నేపథ్యంలో గాంధీభవన్‌లో అధికార ప్రతినిధులతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి సమావేశమయ్యారు. శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ పక్షాన అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు.
ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి..
అంశాల వారీగా సమగ్రమైన సమాచారాన్ని తీసుకుని, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ప్రతినిధులకు ఉత్తమ్ స్పష్టం చేశారు. కరోనా రోగులపై నిర్లక్ష్యం, ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక సదుపాయాల లోపాలు, శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదం, మైనారిటీ సమస్యలు, ఎస్సీ సమస్యలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నూతన రెవెన్యూ చట్టం, ఎల్ఆర్ఎస్ వల్ల పేదలపై భారం, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి, గ్రేటర్ హైదరాబాద్లో రోడ్ల దుస్థితి, ఇతర సమస్యలను అధ్యయనం చేయడానికి అధికార ప్రతినిధులు బాధ్యతలు తీసుకోవాలన్నారు.