ఈ డోలాయమాన పరిస్థితికి కారణం... ఏ రంగాన్ని చూసినా నిరంతర విచలనమే (డిస్‌రప్షన్). ఆర్థిక, సాంకేతిక రంగాల్లో మార్పులు ఎంత శరవేగంగా మారిపోతున్నాయో చూస్తున్నాం. మున్ముందు ఇవి మరింత జోరందుకుని, మరిన్ని రంగాలకు విస్తరిస్తే- ఇప్పుడున్న కొలువులు, జీతాలు, జీవితాలు ఉండకపోవచ్చు. ఎవరూ కచ్చితంగా చెప్పలేరు... భవిష్యత్తులో ఏ రంగం ఎలా ఉండబోతోందో. కానీ, ఒక్కటైతే కచ్చితం- భవిష్యత్తు ఇప్పటికంటే భిన్నంగానే ఉంటుంది. మారుతున్న ప్రపంచాన్ని నియంత్రించడం మన చేతుల్లో లేని విషయం. గతం గురించి, గత పద్ధతుల గురించిన ఆలోచనల్ని విదిలించుకుని... మార్పునకు అనుగుణంగా మనల్ని మనం మలచుకోవడం మాత్రం కచ్చితంగా మన చేతుల్లో పనే! ఇందులో రెండు కీలక అంశాలున్నాయి. ఒకటి- మార్పును ఆకళింపు చేసుకోవడం (అడాప్ట్). రెండు- ఆ మార్పునకు అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం (అప్‌గ్రేడ్).
- మనం పనిచేస్తున్న రంగం ఎలా మారుతోంది? చేస్తున్న పనిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? అన్నది అవగాహన చేసుకోవాలి.
- ఆ తర్వాత ఆ మార్పులకు అనుగుణంగా నేనెలా మారాలి? ఏయే అంశాలపై పట్టు సాధించాలి? ఎలా సాధించాలి? అందుకున్న మార్గాలేంటి? అన్నది పరిశోధన చేయాలి. అందుకు అనుగుణంగా సాధన చేయాలి. రొటీన్‌కు భిన్నంగా.. యంత్రాలు, మర మనుషులు చేయలేని పనుల్ని మనం సమర్థంగా చేయగలగాలి.
- విశ్లేషణాత్మక ఆలోచన, సహానుభూతి, సృజన, వ్యూహరచన, కళ, ఊహాత్మకత, ముందుచూపు- ఇవి ఉండాలేగానీ... పోటీలో నెగ్గేది మనమే. అనిశ్చితిని చీల్చుకుని నిలకడగా, నిశ్చింతగా సాగిపోవచ్చు. ఉద్యోగాలన్నీ పోయి యంత్రాలే పనిచేస్తాయనటం వాస్తవదూరం. నైపుణ్యాలను పెంచుకుని, వాటిని విధుల్లో ఎలా అన్వయించుకుంటామన్నదే మనుగడకు మూలాధారం.
‘‘శాశ్వతమైనది మార్పే. నిరీక్షణను నమ్మి, అనిశ్చితిని ఆలింగనం చేసుకోండి. ఏది నిశ్చయంగా లేనప్పుడు... అన్నీ సుసాధ్యాలే అవుతాయి''.
- మాండీ హేల్, రచయిత్రి
ఇదీ చూడండి: New Year Resolutions: 'వచ్చింది కదా అవకాశం.. ఓ మంచి మాట అనుకుందాం'