రెండు సంవత్సరాల నుంచి ఒళ్లంతా దద్దురులు వస్తున్నాయి. ఎక్కడ చూపించినా తగ్గటం లేదు. కూలికిపోతేనే కడుపులు నిండే బతుకులు మావి. వచ్చే కొంత ఆదాయం వైద్యానికే సరిపోతుంది. పిల్లలు చదువుకు, ఇళ్లు గడవడానికి కష్టంగా ఉంది. శరీరమంతా దురద వస్తోంది: అంజనమ్మ
కలుషితమైన గాలిని పీల్చడం వల్ల నాకు గర్భస్రావం అయింది. గ్రామంలో చాలా మందికి ఇలానే జరిగింది. కానీ ఎవరూ బయటకు చెప్పుకోలేకపోతున్నారు. అధికారులు ఎవరూ మా బాధల్ని పట్టించుకోవటం లేదు: శ్రీదేవి
ఇదీ... యురేనియం కర్మాగార పీడిత గ్రామాల్లో ప్రజల పరిస్థితి. 2007లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుమ్మలపల్లి ప్రారంభమైనప్పటి నుంచి ఇవే సమస్యలు, కష్టాలు. తుమ్మలపల్లి, కేకే కొట్టాల, మబ్బుచింతలపల్లి, భూమయ్యగారి పల్లి, కనంపల్లి, రాచకుంటపల్లిలో ఎవరిని కదిపినా కన్నీళ్లతోనే సమాధానమిస్తారు. భూగర్భజలాలు కలుషితమై తీవ్రస్థాయిలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వ్యాధులు వెంటాడుతున్నాయి. పంట నష్టాల సంగతి సరేసరి. ఏళ్ల తరబడి ఆందోళనలు చేసినా లాభం లేకపోగా అధ్యయన కమిటీ ముందైనా సమస్యలు చెప్పుకుందామని పనులు మానుకుని మరీ ఎదురుచూశారు. తొలిరోజు కమిటీ సభ్యులు కర్మాగారం పరిశీలనకే పరిమితం కావటంతో ఈటీవీ భారత్తో ముందు గోడు వెళ్లబోసుకున్నారు.
తాగునీటిలో యురేనియం కలయికతో ఎక్కువమంది చర్మవ్యాధులతో నరకం చూస్తున్నారు. మరికొందరు కలుషితనీటితో గర్భస్రావం అయిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. పంటలూ పనికి రాకుండా పోతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. మొదటిరోజు పర్యటనలో గ్రామస్థుల వద్దకు రాని కమిటీ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేంద్రం వేసిన కమిటీ ఏమీ తేల్చకుండానే సరిపెట్టిందని, కనీసం ఈ కమిటీ అయినా పరిష్కారం చూపాలని యురేనియం బాధితులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి