కాళేశ్వరం ప్రాజెక్టుకు జీవనాడి అయిన ప్రాణహిత నదిలో ఈ ఏడాది ముందుగానే ప్రవాహం కనిపిస్తోంది. రెండు రోజులుగా మేడిగడ్డ బ్యారేజీ వద్ద 3,600 క్యూసెక్కులు వస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 2 టీఎంసీలు వచ్చి చేరాయి. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మూడు బ్యారేజీల్లో కలిపి 11.26 టీఎంసీల నిల్వ జలాలు ఉన్నాయి. మహారాష్ట్ర, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పెన్‌గంగ, వార్ధా పరీవాహకానికి వరద వస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయనే సమాచారంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. మేడిగడ్డకు ప్రవాహం పెరిగితే వెంటనే పంపుహౌస్‌లను నడిపి ఎల్లంపల్లికి.. అక్కడి నుంచి మధ్య మానేరుకు నీటిని తరలించడానికి ఇంజినీర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని ఎత్తిపోయనున్నారు. మధ్యమానేరు తరువాత పలు జలాశయాల కింద ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు వీలుగా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం చెరువులను నింపాలని నిర్ణయించారు. కాళేశ్వరం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద కలిపి మొత్తం 4,500 చెరువులను మొదటి దశలోనే నింపేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కృష్ణా పరీవాహకంలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 450 చెరువులు ఉన్నాయి.
శ్రీశైలానికి 12 వేల క్యూసెక్కులు
ఆలమట్టి, నారాయణపూర్‌ల నుంచి వస్తున్న ప్రవాహం కొంత తగ్గింది. నారాయణపూర్ నుంచి జూరాలకు 9,577 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. జూరాల వద్ద జలాశయంలోకి 14 వేల క్యూసెక్కులు వస్తుండగా విద్యుత్తు ఉత్పత్తి, కాల్వలకు కలిపి 20 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి విడుదలవుతున్న ఈ నీరు శ్రీశైలానికి చేరుకుంటోంది. ఈ జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను శనివారం నాటికి 34.83 టీఎంసీలు ఉన్నాయి. గోదావరి పరీవాహకంలోని సింగూరు జలాశయానికి3,640 క్యూసెక్కులు వస్తున్నాయి.
ఇదీ చూడండి: Minister harish rao: కేంద్రం కొవిడ్ వ్యాక్సిన్‌ను త్వరగా పంపిణీ చేయాలి