రైల్వే ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ వినూత్న ప్రయోగం చేపట్టింది. ప్రయాణికులకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు అత్యాధునిక సాంకేతికతతో మేఘదూత్ వాటర్ కియోస్క్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో గాలిలోని తేమతో తాగునీరు తయారు చేస్తారు. ఆ నీరు మినరల్ వాటర్ కంటే శుద్ధిగా ఉంటుంది.
మొదటగా సికింద్రాబాద్‌లో...
దేశంలోనే మొట్టమొదటగా... ఈ పరికరాన్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి తెచ్చారు. రైల్వే ఉన్నతాధికారులు సంజీవ్ లోహియా, మైత్రి ఆక్వాడేట్ సంస్థ ఎండీ రామకృష్ణ ప్రారంభించారు. స్టేషన్లో ప్రయాణికులకు తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు మైత్రి ఆక్వాడేట్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ సంస్థకు ఈ బాధ్యత అప్పగించింది దక్షిణ మధ్య రైల్వే.
మినరల్ వాటర్ కంటే శుద్ధిగా
రైల్వేలో ప్రయాణికులకు మంచినీరు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు రైల్వే అభివృద్ధి సంస్థ ఎండీ లోహియా తెలిపారు. మినరల్ వాటర్ కంటే కూడా ఈ నీరు మరింత శుద్ధిగా ఉంటుందని వెల్లడించారు. ఈ సదుపాయం 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు.
తేమను ఒడిసిపట్టి
భారత రసాయనిక సాంకేతిక సంస్థ సహకారంతో మేక్ ఇన్ ఇండియా చొరవతో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నట్లు మైత్రి సంస్థ ఎండీ రామకృష్ణ తెలిపారు. ఈ విధానంలో గాలిలోని తేమను ఒడిసిపట్టి, పలుమార్లు వడపోసి శుద్ధి చేయడం ద్వారా మంచినీరు తయారవుతుందని రంజన్ వెల్లడించారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి రోజు వెయ్యి లీటర్ల నీటిని ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
సరసమైన ధరకే...
ఇప్పటి వరకు పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని మన దేశంలోనే తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఐఆర్సీటీసీ అందిస్తున్న ధరలకే ఈ నీటిని ప్రజలకు అందిస్తున్నారు. దీనిద్వారా మామూలు ధరకే శుద్ధమైన తాగనీరు ప్రయాణికులకు అందుతోంది.
- ఇవీ చూడండి : 'కేసీఆర్‌ది బార్ బచావో.. బార్ బడావో నినాదం'