భాగ్యనగరంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామని జలమండలి ఎండీ దానకిషోర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వేసవిలో మంచినీటి సరఫరాపై.. సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పెరిగిన నీటి సరఫరా...
గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువగా నీటి ట్యాంకర్లు అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. నీటి అవసరం ఎక్కువగా ఉన్న 20 చోట్ల వెంటనే నూతన ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైతే అదనంగా 130 ట్యాంకర్లను అద్దె ప్రతిపాదికన ఏర్పాటు చేయనున్నారు. గతేడాది రోజుకు 1800 నుంచి 2వేల ట్రిప్పులు సరఫరా చేస్తే.. ప్రస్తుతం 3 వేల నుంచి 3వేల 600 ట్రిప్పుల నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.
కలుషిత నీరు రాకుండా చర్యలు...
మంచినీటి సరఫరాలో కలుషిత నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ఎండీ ఆదేశించారు. జీఎం, మేనేజర్, లైన్మెన్, మంచినీటి సరఫరా సమయంలో క్షేత్రస్థాయిలతో పర్యటించి నీటిని వృథాగా రోడ్డుపై వదులుతున్న వారిని గుర్తించాలని.. వారికి నీటి వృథాపై అవగాహన కల్పించాలని చెప్పారు. వాణిజ్య ట్యాంకర్ల ట్రిప్పులను కుదించి నీటిని సరఫరా చేయాలని సూచించారు.
కొన్ని చోట్ల నీళ్లు అందక ప్రజల ఇక్కట్లు...
జలమండలి ఇలా చెబుతున్నప్పటికీ గ్రేటర్ పరిధిలో చాలా చోట్ల నీరురాక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నగర శివారు ప్రాంతాల్లో మాత్రం ఈ బాధవర్ణణాతీతంగా ఉందని వాపోతున్నారు. పట్టణ నడిబొడ్డున కూడా ట్యాంకర్ బుక్ చేసి రోజులు గడిచినా రావడం లేదని... ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇననైన తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: పాలమూరులో అడుగంటిన భూగర్భజలాలు