Warangal CP Ranganath responded on Hindi paper leak: రాష్ట్రంలో పదో తరగతి హిందీ పేపర్ వాట్సాప్‌లో ప్రత్యక్షమైన ఘటన కలకలం రేపిన విషయం విధితమే. అయితే ఈ లీక్ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. హిందీ పేపర్ ఎలా బయటకు వచ్చింది, వాట్సాప్‌లో ఎవరు వైరల్ చేశారనే విషయాలను వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు. కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి హిందీ పేపర్ బయటకు వచ్చిందన్నారు. ఓ మైనర్ బాలుడు.. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన తన స్నేహితునికోసం చెట్టు కొమ్మ పట్టుకుని ఒకటో అంతస్థులోని పరీక్ష కేంద్రంలోకి వెళ్లాడు.
అయితే రూమ్ నెం.3 కిటికీ చెట్టుకు ఆనుకుని ఉంటుంది. ఆ బాలుడు అక్కడ పరీక్ష రాస్తున్న హరీశ్ అనే విద్యార్థి వద్ద పేపర్ తీసుకుని తన వెంట తెచ్చుకున్న సెల్‌ఫోన్‌లో ఫొటో తీశాడు. అనంతరం తన ఫ్రెండ్‌కు చీటీలు ఇద్దామని వెళ్లాడు. ఈ క్రమంలో హిందీ పరీక్ష పేపర్ ఫొటోలను శివ గణేశ్‌కు పంపించాడు. ఎస్‌ఎస్‌సీ గ్రూపులో 31 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గ్రూపులో ఆ హిందీ పేపర్ ఫొటోను శివ గణేశ్ పోస్టు చేశాడు. పరీక్ష ఉదయం 9.30 మొదలవ్వగా.. 9.45 గంటలకు బాలుడు ఆ పేపర్‌ను ఫొటో తీశాడు.
9.55 గంటలకు శివ గణేశ్ ఎస్‌ఎస్‌సీ స్టూడెంట్స్ గ్రూపులో పోస్టు చేశాడు. ఆ తర్వాత (మాజీ విలేకరి) ప్రస్తుతం కేఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గుండెబోయిన మహేశ్‌కు ఆ పరీక్ష పేపర్ని ఫార్వర్డ్ చేశాడు. మహేశ్ వెంటనే ఆ హిందీ పేపర్ని ప్రశాంత్‌కు పంపించాడు. అలా అక్కడినుంచి వివిధ గ్రూపులలో పరీక్ష పేపర్ వైరల్ అయింది. దీనిని ప్రశాంత్.. ఆ పేపర్ ఫొటోతో పాటు.. బ్రేకింగ్ న్యూస్ వరంగల్‌లో హిందీ పేపర్ లీకైంది. ఉదయం 9.30 గంటలకే లీకైన పరీక్ష పేపర్. వరుసగా రెండో రోజు పదో తరగతి పేపర్ లీక్. ఈ మేరకు ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఎస్‌ఎస్‌సీ స్టూడెంట్స్ వాట్సప్ గ్రూపులో పదో తరగతి ప్రశ్నపత్రం ప్రత్యక్షం.. అని టెక్ట్స్ మెసేజ్ పెట్టాడు. దీనిని విద్యార్థుల తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేసే విధంగా ప్రచారం చేశారు.
ఈ మెసేజ్‌ను హైదరాబాద్‌లో ఉన్న కొందరు మీడియా ప్రజా ప్రతినిధులకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు 11.24కు మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. హిందీ పరీక్ష పేపర్ లీక్ కాలేదు. లీకేజీకి కాపీయింగ్‌కు తేడా ఉంటుందని సీపీ తెలిపారు. పరీక్ష ప్రారంభం కాకముందు ఎగ్జామ్ పేపర్ బయటకు వస్తే లీక్. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత ప్రశ్నపత్రం బయటకు వస్తే అది కాపీయింగ్ అవుతుందని తెలిపారు. నిందితులపై సెక్షన్ 5 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. మైనర్ బాలుడిని జువైనల్ హోంలో హాజరు పరుస్తామని చెప్పారు. శివ గణేష్, ప్రశాంత్, మహేశ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీపీ వివరించారు. దురుద్దేశపూర్వకంగా చేసిన ఈ ప్రచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మొద్దని సీపీ రంగనాథ్ వారికి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: