ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ సాగర తీరం రణ రంగాన్ని తలపిస్తోంది. నౌకాదళ దినోత్సవాల కోసం నేవీ, ఆర్మీ, వైమానిక దళాలు చేస్తున్న సన్నాహక విన్యాసాలు బీచ్ రోడ్డుకు వచ్చే వారిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇసుక తిన్నెలపై తుపాకులతో కాల్పులు, ఆపదలో ఉన్నవారిని రక్షించేందుకు నీలి జలాలపై రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు దూసుకువచ్చే హెలికాప్టర్లు, ఇంతలోనే వాయు వేగంతో కనురెప్పపాటులో సర్రున వచ్చి మాయమయ్యే యుద్ధ విమానాలు, గంభీరంగా సముద్రంపై తేలియాడే యుద్ధ నౌకలు అన్నీ కలిసి ఆర్కే బీచ్ వద్ద ఓ యుద్ధమే జరుగుతోందా అని అనుభూతి కలిగించే వాతావరణాన్ని తెచ్చిపెట్టాయి.
నౌకాదళ దినోత్సవం నాడు ప్రదర్శించే విన్యాసాల నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఫుల్ డ్రస్ రిహార్సల్స్‌ను చేశారు సైనికులు. ఈ విన్యాసాలను తిలకించేందుకు సందర్శకులు, నౌకాదళ సిబ్బంది కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఆర్కే బీచ్ కు చేరుకున్నారు. పేరా గ్లైడర్లు, ఆకాశం నుంచి పారాచూట్ లతో భూమిపైకి మన త్రివర్ణ పతాకాన్నిచేపట్టి పక్షిలా భూమిపై వాలిన సైన్యం సాహసం ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది.
ఈ నెల 4న జరగనున్న నౌకాదళ దినోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వేలాదిమంది ప్రజలు విన్యాసాలు తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సుమారు గంట పాటు జరిగే నౌకాదళ విన్యాసాలు సందర్శకులకు కనువిందు చేయనున్నాయి.
ఇదీ చూడండి: రూ.100 లంచం అడిగిన అధికారులపై సీబీఐ కేసు