Robotic Sai Baba idol in Vizag : సాయిబాబా.. ఈ పేరు వినగానే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పరిసర వాసులకు చినగదిలిలోని నార్త్ షిర్డీ సాయి దేవాలయమే గుర్తుకువస్తుంది. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే స్వయంగా సాయిబాబానే భక్తులకు సూక్తులు బోధిస్తూ దర్శనమిస్తారు. సాయిబాబా ఏంటి బోధనలు చేయడం ఏంటీ అనుకుంటున్నారా..? ఇదంతా రోబోటిక్ సాయిబాబా మహిమ. అచ్చం మానవ రూపంతో, మాటలకు నోరు కదుపుతూ, తల ఆడిస్తూ, సహజమైన ముఖ కవళికలతో.. ఆ సాయి నాథుడే దిగివచ్చారా అనే రీతిలో మైమరిపిస్తోంది.. రోబో గాడ్.
ఈ రోబోటిక్ బాబాను ఏయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి అయిన రవిచంద్ మూడేళ్లు శ్రమించి రూపొందించారు.. సిలికాన్ పదార్థంతో ముఖాన్ని, కెనడా నుంచి తెప్పించిన ప్రత్యేక ఫైబర్ గ్లాస్‌తో మిగిలిన భాగాలను తయారు చేశారు. అధునిక సాంకేతికతకు , వాయిస్ సింకరనైజేషన్ జోడించడంతో .. ఆ సాయిబాబానే చూసిన అనుభూతిని భక్తులు సొంతం చేసుకుంటున్నారు. ఈ దైవ రోబోను దర్శించుకున్న భక్తుల ప్రచారంతో.. విశాఖ నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆలయానికి భక్తుల తాకిడి బాగా పెరిగింది.
"నిజంగా ఈ రోబో సాయిబాబాను చూసి ఆశ్చర్యపోయాను. వైజాగ్‌లో ఇలాంటి రోబో సాయి ఉండటం ఆనందంగా ఉంది. అందరూ వచ్చి ఈ రోబోసాయిని చూడాలి. నిజంగా షిర్డీలోని సాయిబాబాను చూసినట్లే ఉంది." - లక్ష్మి, భక్తురాలు
"అచ్చంగా మనిషి మాట్లాడినట్లే ఉంది. ప్రత్యక్ష దైవం బాబాను చూసినట్లే అనిపిస్తోంది. బాబా మాట్లాడుతున్న తీరు కూడా బాగా నచ్చింది. నేరుగా బాబాతో మాట్లాడినట్లు అనిపిస్తోంది. చూసిన దగ్గరన్నుంచి చాలా ఆనందంగా ఉంది . " - జగదీష్, భక్తుడు
"గురు, దైవ, సజీవ రూపాలుగా షిర్డీలో ఉన్న సాయిబాబాలాగానే ఈ బాబా ఉన్నారు. చినగదిలిలోని నార్త్ షిర్డీ సాయి ఆలయంలో ఉన్న సాయిబాబాను చూసేందుకు చాలా మంది భక్తులు వస్తున్నారు. రోబోటిక్ బాబాను ఏయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి అయిన రవిచంద్ మూడేళ్లు శ్రమించి రూపొందించి ఇక్కడ ఏర్పాటు చేశారు. దేశీయ, విదేశీ పరిజ్ఞాన్ని జోడించి ఈ రోబోటిక్ సాయిని రూపొందించారు. " - సాయిబాబా ఆలయ పూజారి
ఇవీ చదవండి: మొదలైన గ్రూప్-3 దరఖాస్తు ప్రక్రియ.. ఆ నెలలోనే పరీక్ష!