కర్ణాటక రాష్ట్ర పశు వైద్య, మత్స్య విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులుగా ప్రొఫెసర్ టీఎస్ వీరోజిరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రొఫెసర్ వీరోజిరావు... హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం డీన్‌గా... ఎకడమిక్ కౌన్సిల్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతున్న పాడి, పశు పోషణ, పాల ఉత్పత్తిలో పుంగనూరు దేశవాళీ ఆవుల పాత్ర, నెల్లూరు గొర్రెల విశిష్టత, బ్రాయిలర్, లేయర్ కోళ్లల్లో ఆరోగ్యం, దేశవాళీ కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం, చిత్తూరు జిల్లాలో పీపీఆర్ విధానంలో జీవాల పెంపకం, జన్యు మార్పులు, కోడి గుడ్లు, ఈము గుడ్లు వంటి అంశాలపై ఆయన రాసిన జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో 60 పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి.
పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, విస్తరణ విభాగం సంచాలకులుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో కూడా పలు హోదాల్లో పనిచేశారు. కర్ణాటక పశు వైద్య విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులుగా ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు. తాజా నియామకం పట్ల పీవీ నరసింహారావు పశు విశ్వవిద్యాలయం హెడ్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: యాదాద్రి పుణ్యక్షేత్రంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత