Vinodkumar on Railways: రైల్వే కొత్త లైన్ల మంజూరులో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని, రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆరోపించారు. కొత్త రైల్వే లైన్ల మంజూరు విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో జీవనోపాధి కోసం వలస వస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు గతంలో వలస వెళ్లిన తెలంగాణ వాసులు సైతం స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. దీంతో రైల్వే ప్రయాణానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకొందన్న వినోద్ కుమార్... రైల్వే కొత్త లైన్లు మంజూరు చేయాలని కోరారు.
కుంటి సాకులు చెబుతూ...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్ మాత్రమే మంజూరైందన్న ఆయన... రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమిని సమకూర్చి మూడో వంతు నిర్మాణ ఖర్చును భరించినందుకే అది కూడా వచ్చిందని అన్నారు. విభజనచట్టం ప్రకారం తెలంగాణలో ఆర్నెళ్ల కాలంలోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. ఇప్పటి వరకు అతీగతీ లేకుండా పోయిందని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రైల్వే కొత్త లైన్ల కోసం 11 ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపామని, ఏవో కుంటి సాకులు చెబుతూ రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పక్కన పెట్టిందని ఆరోపించారు.
25 కొత్త లైన్ల మంజూరు కోసం..
కరీంనగర్ - ఖాజీపేట్, మణుగూరు - రామగుండం, నంద్యాల - జడ్చర్ల, కోయగూడెం మైన్స్ - తడికలపూడి, భద్రాచలం రోడ్ - విశాఖపట్నం లైన్ల కోసం ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. హైదరాబాద్ - శ్రీశైలం, సిద్దిపేట - అక్కన్నపేట్, వాషిం - ఆదిలాబాద్, పటాన్ చెరు - సంగారెడ్డి, బై పాస్ లైన్ ఎట్ పగిడిపల్లి ప్రతిపాదనల్లో ఉన్నాయని అన్నారు. వీటికి తోడు మరో 25 రైల్వే కొత్త లైన్ల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వానికి పంపిందని, డీపీఆర్ పూర్తయి మంజూరు కోసం ఎదురుచూస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. గద్వాల - మాచర్ల ఆధునీకరణ, మౌలాలి - భువనగిరి, మౌలాలి - ఘట్ కేసర్, ఘట్ కేసర్ - భువనగిరి, కాచిగూడ - చిట్యాల ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. గడ్ చందూర్ - ఆదిలాబాద్, కృష్ణ - వికారాబాద్, జగ్గయ్యపేట - మిర్యాలగూడ, పగిడిపల్లి - శంకర్ పల్లి, పటాన్ చెరు - ఆదిలాబాద్, పాండురంగాపురం - భద్రాచలం లైన్ల డీపీఆర్‌లు పూర్తయినట్లు చెప్పారు.
ఇప్పటికైనా మంజూరు చేయాలి..
సికింద్రాబాద్ - జహీరాబాద్, విష్ణుపురం - వినుకొండ, కరీంనగర్ - హసన్ పర్తి, మహబూబ్ నగర్ - గుత్తి, సికింద్రాబాద్ -మూడ్ఖేడ్ - ఆదిలాబాద్, ఘన్పూర్ - సూర్యాపేట, బోధన్ - లాతూర్ రోడ్, యావత్ మాల్ - ఆదిలాబాద్ లైన్లు మంజూరు కోసం ఎదురుచూస్తున్నాయని వినోద్ కుమార్ లేఖలో తెలిపారు. కొత్తగూడెం - కొత్తపల్లి మధ్య సర్వే అప్డేట్ పనులు, సికింద్రాబాద్-కాజిపేట్ మధ్య మూడో లైన్, వికారాబాద్ వద్ద బైపాస్ లైన్, ఆర్మూర్ - ఆదిలాబాద్ మధ్య కొత్త లైన్ అప్డేషన్, బీబీనగర్ - గుంటూరు మధ్య విద్యుదీకరణ, అకొలా-డోన్ మధ్య విద్యుదీకరణ పనుల కోసం కోసం ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల ఇప్పటికైనా వివక్ష మానుకొని రానున్న రైల్వే బడ్జెట్ సమావేశాల్లో రైల్వే కొత్త లైన్లు మంజూరు చేయాలని వినోద్ కుమార్ కేంద్ర రైల్వే మంత్రిని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: