నిబంధనలు జనాలకే.. మాకేం కాదు అన్నట్లుంది ఏపీలోని విజయవాడ పోలీసుల తీరు. వాహన తనిఖీలు చేసే పోలీసులకే లైసెన్స్‌లు లేవు. అయినా దర్జాగా వాహనాలతో రోడ్డెక్కేస్తున్నారు. ఎంత మంది సిబ్బందికి లైసెన్సులు ఉన్నాయో తెలుసుకునేందుకు పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు అన్ని స్టేషన్ల నుంచి వివరాలు సేకరించారు.
సుమారు 400 మందికి లైసెన్సులు లేవు
వాహనాలు నడిపే వారిలో దాదాపు 400 మందికి లైసెన్సు లేనట్లు తేలింది. ఈ జాబితాలో హోంగార్డు నుంచి ఎస్సై స్థాయి వారు కూడా ఉన్నారు. పెద్ద సంఖ్యలో సిబ్బందికి లైసెన్సులు లేకపోవడంతో.. వారికి గడువు నిర్దేశించారు. లేనిపక్షంలో సాధారణ పౌరుల్లాగా చలానాలు కట్టడంతో పాటు శాఖాపరంగా కూడా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. దీంతో పత్రాలు లేని వారు ఎల్.ఎల్.ఆర్(LLR) స్లాట్ల బుకింగ్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వరుస కట్టారు.
వారి కోసం ప్రత్యేకంగా కార్యాలయం తెరిచి..
ప్రస్తుతం ఖాళీలు లేకపోవడంతో రవాణా శాఖ అధికారులు.. పోలీసుల కోసం ప్రత్యేకంగా రోజుకు 20 నుంచి 30 స్లాట్లు సర్దుబాటు చేసి ఎల్.ఎల్.ఆర్(LLR) పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 250 మంది వరకు హాజరయ్యారు. ఆదివారం సెలవు రోజైనా ప్రత్యేకంగా పోలీసుల కోసమే ఆర్టీఏ(RTA) కార్యాలయం తెరిచి, పరీక్ష నిర్వహించారు. ఎల్.ఎల్.ఆర్(LLR) పరీక్షకు హాజరవుతున్న వారిలో 30 శాతం మంది తప్పుతున్నట్లు ఆర్టీఏ(RTA) అధికారులు తెలిపారు. ఉత్తీర్ణులు కానివారికి మళ్లీ వారం తర్వాత హాజరయ్యేందుకు అవకాశం ఇచ్చారు. పరీక్ష కోసం కమిషనర్ కార్యాలయంలో సిబ్బందికి ప్రత్యేకంగా అవగాహన తరగతులు నిర్వహించి తర్ఫీదు ఇస్తున్నారు.
డ్రైవింగ్ టెస్టుకు హాజరుకావాలి
ఎల్.ఎల్.ఆర్(LLR) వచ్చిన తర్వాత లైసెన్సు కోసం వాహనంతో సహా డ్రైవింగ్ టెస్టుకు హాజరుకావాల్సి ఉందని సీపీ శ్రీనివాసులు తెలిపారు. మోటారు వాహన చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులకే సరైన పత్రాలు లేకపోతే ప్రజల్లో చులకన అవుతారని హెచ్చరించారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. నిబంధనల ప్రకారం పత్రాలు లేకుంటే చర్యలు తప్పవన్నారు.
ఇవీ చదవండి:
MURDER: కోడలితో వివాహేతర సంబంధం.. కుమారుడిని చంపిన తండ్రి!
SI RAPE ATTEMPT: ఎస్సై శ్రీనివాసరెడ్డిపై మహిళా ట్రైనీ ఎస్సై ఫిర్యాదు