Rajya Sabha panel of vice chairmans : రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్ల జాబితా నుంచి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పేరు తొలగించారు. ఈ నెల 5న మొత్తం 8 మంది పేర్లతో కూడిన ప్యానల్ వైస్ ఛైర్మన్ల జాబితాను రాజ్యసభ విడుదల చేసింది. అందులో భువనేశ్వర్ కలితా, హనుమంతయ్య, తిరుచ్చి శివ, సుఖేందు శేఖర్‌రాయ్, సస్మిత్ పాత్ర, సరోజ్ పాండే, సురేంద్రసింగ్ నాగర్, విజయసాయిరెడ్డి పేర్లు ఉన్నాయి. ఈ అవకాశం కల్పించిన రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ విజయసాయిరెడ్డి అదే రోజు జాబితాను జత చేస్తూ ట్వీట్ కూడా చేశారు. తాను సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని, సభా నిర్వహణలో పూర్తిస్థాయిలో సహకారం అందిస్తానని హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు.
అయితే బుధవారం మధ్యాహ్నం నూతన ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ ప్యానల్ వైస్ ఛైర్మన్ల జాబితా పునరుద్ధరించామని.. ఏడుగురి పేర్లు మాత్రమే చదివారు. విజయసాయి రెడ్డి పేరు చెప్పలేదు. బుధవారం నమోదైన రాజ్యసభ రికార్డుల్లోనూ ఆ ఏడుగురి పేర్లు మాత్రమే ఉన్నాయి. అలాగే రాజ్యసభ సచివాలయం బీఏసీకి సభ్యులను ఆహ్వానిస్తూ 5న పంపిన నోటీసులోనూ ప్యానల్ వైస్ ఛైర్మన్ల జాబితాలో ఏడుగురి పేర్లు తప్పితే.. విజయసాయి రెడ్డి పేరు కనిపించలేదు. అందులో విజయసాయి రెడ్డిని బీఏసీ సభ్యుడిగా మాత్రమే పేర్కొన్నారు. బుధవారం రాత్రి అప్డేట్ చేసిన రాజ్యసభ వెబ్సైట్లో ఉన్న జాబితాలోనూ ఆయన పేరు లేదు.
ఇవీ చదవండి..:
Singareni Privatization : సింగరేణిని మేమెలా ప్రైవేటీకరిస్తాం?
TRS MPs in Parliament : 'ప్రజా గళమే ప్రతిపక్షం.. చిన్న పార్టీలని చిన్నచూపు సరికాదు'