ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల్లో స్వయం సమృద్ధి కోర్సులకు వీడియో పాఠాలు బోధించేందుకు రంగం సిద్ధమైంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఓయూలోని ఈఎంఆర్సీ... స్వయం సమృద్ధి బోధనాంశాలకు వీడియో పాఠాలను అందిస్తుంది. విద్యార్థులకు వ్యక్తిగత, సాంకేతిక అంశాల్లో నైపుణ్యం పెంచేందుకు డిగ్రీ, పీజీ సెమిస్టర్లలో పలు ఐచ్ఛికాలు అందుబాటులో ఉన్నాయి. ఆ కోర్సులకు ప్రత్యేక క్రెడిట్లు కూడా ఉన్నాయి. అయితే స్వయం సమృద్ధి కోర్సులు బోధించే సిబ్బంది కొరతను అధిగమించేందుకు... వీడియో పాఠాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. రూసా పథకం నిధులతో ఈఎంఆర్సీ నుంచి వీడియో పాఠాలను పొందనున్నారు.
ప్రాక్టికల్ శిక్షణ కూడా...
ఈఎంఆర్ సీ రూపొందించిన వీడియో రూపంలో పాఠాలను డిగ్రీ, పీజీ విద్యార్థులకు బోధిస్తారు. రికార్డెడ్ వీడియోలు, టెక్స్ట్, గ్రాఫిక్స్, అసైన్ మెంట్ల రూపంలో ఈఎంఆర్ సీ ప్రాక్టికల్ శిక్షణ కూడా అందిస్తుంది. ఇవాళ రూసా, రాష్ట్ర కళాశాల విద్యా కమిషనరేట్, ఈఎంఆర్సీ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, ఈఎంఆర్ సీ డైరెక్టర్ నరేందర్ తదితరులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు వివిధ అంశాలపై వీడియో బోధన అందుబాటులో ఉండేలా మరో ఒప్పందం జరిగింది. దేశవ్యాప్తంగా మీడియా కేంద్రాల్లోని వీడియోలను ఓయూ, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మగాంధీ, పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ కన్సార్టియంతో రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ మరో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇదీ చూడండి: 'లవర్స్తో కలిసి భర్తను మేడపై నుంచి తోసిన భార్య!'