ప్రపంచానికే హైదరాబాద్.. బయోటెక్నాలజీ హబ్‌గా మారుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice president Venkaiah Naidu) పేర్కొన్నారు. భారత్ బయోటెక్(Bharat biotech) దేశానికి చెందింది కావడం గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు.
16 రకాల వ్యాక్సిన్లు...
హైదరాబాద్ జినోమ్‌వ్యాలీలోని భారత్ బయోటెక్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాస్త్రవేత్తలనుద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. జినోమ్ వ్యాలీలో అనేక సంస్థలు కొలువుదీరాయని తెలిపారు. హైదరాబాద్ బయో టెక్నాలజీ హబ్‌గా మారుతోందన్నారు. భారత్ బయోటెక్ 16 రకాల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు.
4 బిలియన్ల టీకాలకు పైనే...
మన శాస్త్రవేత్తలు అనేక దేశాల ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారని ఉపరాష్ట్రపతి కొనియాడారు. భారత్ బయోటెక్ ఇప్పటివరకు నాలుగు బిలియన్ల టీకాలకు పైనే పంపిణీ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని తెలిపారు. మరింత త్వరగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయాలని, ఆహార, వ్యవసాయ రంగాలపైనా దృష్టి సారించాలని సూచించారు.
'బల్క్ డ్రగ్స్, వాక్సిన్‌లకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. దేశంలో తయారవుతున్న బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం హైదరాబాద్ నుంచి ఉత్పత్తి అవుతుండగా.. ఎగుమతుల్లో 50 శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జీనోం వ్యాలీ హైదరాబాద్‌ను బయో టెక్నాలజీ రంగంలోనూ అగ్రగామిగా నిలిచేందుకు దోహదపడుతుంది. భారత్ బయోటెక్ బృందానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఐసీఎంఆర్, ఎన్‌ఐవీలతో కలిసి తక్కువ సమయంలో దేశీయ టీకా కొవాగ్జిన్‌ను రూపొందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.' -వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
ఆ దృక్పథం మారాలి...
తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు భారత్ బయోటెక్‌ను సందర్శించినట్లు వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. అన్ని విషయాల్లో పశ్చిమదేశాలు గొప్పవనే దృక్పథం మారాలని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Huzurabad By elections: హుజూరాబాద్ బరిలో 800 ఎంపీటీసీలు