భారతదేశం క్షిపణి సాంకేతికత రంగంలో ఆత్మనిర్భరత సాధించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ రంగంలో భారత్‌పై ఇతర దేశాలు ఆధారపడే స్థితికి చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ కీలక పరిణామంలో రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు సాధించిన కృషిని ఆయన అభినందించారు. స్వదేశీ సాంకేతికతతో ఇలా ముందుకెళ్లడం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని అన్నారు. డీఆర్డీఎల్‌లోని డాక్టర్ అబ్దుల్ కలాం క్షిపణి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ప్రాంగణంలోని రెండు నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు.
ఆయన పాత్ర చిరస్మరణీయం..
దేశ భవిష్యత్ రక్షణ అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక రక్షణ సాంకేతికత అభివృద్ధిపై దృష్టిపెట్టాలని వెంకయ్య సూచించారు. ఇందుకు తగ్గట్లుగా ప్రైవేటు రంగానికీ అవకాశాలు కల్పించాలన్నారు. దేశం క్షిపణి రంగంలో ఇంత ప్రగతిని సాధించడంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. ఇటీవల దేశంలో మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి.. రక్షణ, పరిశోధన రంగాల్లో వీరిని మరింతగా ప్రోత్సహించాలని సూచించారు.
అద్వితీయమైన ప్రగతి..
కరోనాకు టీకా విషయంలో మన దేశం అద్వితీయమైన ప్రగతిని సాధించిందని వెంకయ్య పేర్కొన్నారు. రికార్డు సమయంలో టీకా ఉత్పత్తితోపాటు విదేశాలకూ టీకా ఎగుమతి చేయడాన్ని ప్రశంసించారు. వాతావరణ మార్పులపైన మరిన్ని పరిశోధనలు జరగాలని సూచించారు. విజ్ఞాన శాస్త్రం సహా ప్రతి అంశం మాతృభాషలో ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన ఆకాంక్షించారు.