దేశంలో 60 శాతం జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు సుపరిపాలన తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి జరగాలని.. లేనిపక్షంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య విభజన వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా స్నాతకోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఒకప్పుడు భారత్ విశ్వగురుగా ఉండేదని, విదేశీ చరిత్రకారులు దేశం గురించి రాశారని వెంకయ్య అన్నారు. ప్రజాధనానికి రక్షణ ఉండటం చాలా ముఖ్యమని.. కానీ కొంతమంది వల్ల వ్యవస్థపై ప్రభావం పడుతోందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కంపెనీ సెక్రటరీల బాధ్యత ఉందని తెలిపారు.
'ఆత్మనిర్భర్గా మారేందుకు దేశానికి కావాల్సిన శక్తి ఉంది. దీనికోసం యువతలో ఉన్న ప్రతిభను గుర్తించాలి. భారత నాగరికత కాలానుగుణంగా పరీక్షలకు ఎదుర్కొని నిలబడింది. ఏ దేశం కూడా గతాన్ని విడిచి ముందుకు వెళ్లలేదు. దేశంలోని ప్రతి ప్రాంతంలో గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారి గురించి యువతకు తెలియాలి.'
వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
ఇదీ చదవండి: ప్రకృతి వనాలతో ఆహ్లాదం, ఆరోగ్యం: మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్