చట్టసభల్లో సభ్యుల తీరుపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో నాయకులు వాడుతున్న భాష సిగ్గుచేటుగా ఉంటోందన్నారు. రాజకీయ నాయకులు ప్రత్యర్థులే కానీ శత్రువులు కారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. చట్టసభల్లో ప్రజాసమస్యలపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. సీఏఏ సహా అన్ని చట్టాలపై ప్రజలు అధ్యయనం చేయాలన్నారు. ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికీ భారత్లో అంర్భాగమేనని స్పష్టంచేశారు. భారతదేశ చట్టసభలు తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడే హక్కు పొరుగుదేశాలకు లేదని తేల్చి చెప్పారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణతో ఉండటం వలనే.. ఈ స్థాయికి ఎదిగినట్టు చెప్పారు. తనకు కాన్వెంట్ అంటే ఏంటో తెలియదన్నారు.
మాతృభాష కళ్లు అయితే.. పరాయి భాష కళ్లద్దాలు
అందరూ మాతృభాషలో విద్యాభ్యాసం చేయాలన్న వెంకయ్య... మాతృభాష కళ్లయితే, పరాయి భాష కళ్లద్దాల్లాంటివని పేర్కొన్నారు. ఏ మీడియంలో చదివారని.. రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారో గుర్తుంచుకోవాలన్నారు. తనకు మాతృభాష ప్రాణంతో సమానమని, విద్యాసంస్థలు విద్యతో పాటు వినయం, సంస్కారాన్ని పిల్లలకు నేర్పాలని కోరారు. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పు రావాల్సి ఉందన్న వెంకయ్య... చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను బోధించాలని పిలుపునిచ్చారు.
పుస్కకావిష్కరణ
గీతం విశ్వవిద్యాలయం కులపతి కోనేరు రామకృష్ణరావు జీవితం ఆధారంగా రచించిన ఆటో బయోగ్రఫీ పుస్తకం ఆవిష్కరించడం ఆనందంగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయనతో పాటు.. మంత్రి అవంతి శ్రీనివాస్, ఆచార్య కోనేరు రామకృష్ణారావులను గీతం సంస్థల అధ్యక్షుడు శ్రీ భరత్ సత్కరించారు.
ఇదీ చదవండి: పక్కా ప్రణాళిక.. 8 నెలలు.. 121 ఇళ్లు..!