తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ నెలాఖరు లోపు కోర్‌కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సీనియర్ నేత వి. హనుమంతరావు లేఖ రాశారు. ఇటీవల జరిగిన పీవీ నర్సింహరావు శతజయంతి వేడుకల కమిటీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వీహెచ్... పార్టీ తీరుపై, కొందరు నాయకుల వ్యవహారశైలిపై చిర్రుబుర్రులాడారు. పార్టీ అంతర్గత విషయాలపై సమగ్రంగా చర్చించేందుకు కోర్‌కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవట్లేనందున బుధవారం ఉత్తమ్‌కుమార్ రెడ్డికి లేఖ రాశారు.
నెలాఖరులోపు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం నిర్వహించాలని.. తాజా రాజకీయాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార పార్టీని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ నేతలను, శ్రేణులను మరింత బలోపేతం చేయాల్సి ఉందని వీహెచ్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని ఆయన లేఖలో తెలిపారు.
ఇదీ చూడండి: 'కరోనాపై తొలి నుంచీ భారత్ స్పందన భేష్'