పశు వైద్యాధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. మూగజీవాలకు సేవలందించాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. కార్యాలయాలకే పరిమితం కాకూడదని పేర్కొన్నారు. హైదరాబాద్, మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంక్షేమ భవన్‌లో సంబంధిత అధికారులు, సంఘాల ఆధ్వర్యంలో.. డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు.. సిబ్బంది అవసరముందని వెటర్నరీ అధికారుల సంఘం.. మంత్రి సమక్షంలో ప్రతిపాదించింది.
పాడి, మత్స్య, మాంసం ఉత్పత్తుల ద్వారా గ్రామీణాభివృద్ధిలో భాగమవ్వాలని మంత్రి.. అధికారులకు సూచించారు. పశుసంవర్థక శాఖ.. స్వయంగా ఓ బ్రాండింగ్‌తో మాంసం విక్రయాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదనలపై అధ్యయనం చేయాలని కోరారు.
ప్రభుత్వం ఇప్పటికే గొర్రెల పంపిణీ కోసం రాయితీపై రూ. 5వేల కోట్లను వెచ్చించిందని గుర్తు చేశారు. రెండో విడతగా మరో ఐదారు వేల కోట్లను ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మరోవైపు మత్స్య రంగానికి సైతం భారీ కేటాయింపులు చేసిందని వివరించారు.
ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా, రాష్ట్ర వెటర్నరీ అధికారుల సంఘం అధ్యక్షులు డాక్టర్ బేరి బాబు, డాక్టర్ దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కనువిందు: తమలపాకు తన్మయత్వం... గులాబీ గుబాళింపు!