Venkaiah Naidu: స్వాతంత్ర్య అమృతోత్సవాల పేరిట నాటి స్వరాజ్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం ముదావహం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో భారత జాతీయ పతాకం ఆయన ఆవిష్కరించారు. జాతీయ పతాకం ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
స్వరాజ్యం సముపార్జించుకుని 75 ఏళ్ళు గడిచిన నేపథ్యంలో భారత్ మాతాకి జయహో అంటూ వెంకయ్యనాయుడు నినదించారు. భారత జాతిని సంఘటితం చేయగల ప్రేరణాత్మక శక్తి.. మన మువ్వన్నెల జెండా అని కొనియాడారు. మన జాతీయ విలువైన ఏకత్వం, సామరస్యం, సార్వత్రిక సౌభ్రాతృత్వాలు, మన ఆచరణ ప్రతిబింబించాలని అభిప్రాయపడ్డారు. ఈ శుభ సందర్భంలో స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుందాం.. వారు కలలు గన్న నవభారతాన్ని నిర్మించుకునేందుకు కంకణబద్ధులమవుదామని అన్నారు.
75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మనం సాధించిన ఘన విజయాలు, ప్రగతిని చూసి గర్విస్తూ పేదరికం, నిరక్షరాస్యత, సాంఘిక అసమానతలు, లింగ వివక్ష, అవినీతి వంటి సవాళ్లు సమైక్యంగా కలిసి కట్టుగా ఎదుర్కొందామని చెప్పారు. ఆత్మ నిర్భర భారత్ వైపు పురోగమిద్దామని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం, వీరుల త్యాగమే నేటి మన స్వాతంత్య్రమన్న రేవంత్
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు మోదీ పంచసూత్రాలు