ట్యాంక్‌బండ్(Tank Bund)పై ట్రాఫిక్ సమస్యతో సందర్శకులు ఇబ్బంది పడుతున్నందున ప్రతి ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ వెల్లడించిన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ట్యాంక్ బండ్‌పై సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు వాహన రాకపోకలు బంద్ అవుతాయి. సందర్శకుల కోసం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ్టి నుంచి ప్రతి ఆదివారం ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు ఇదివరకే వెల్లడించారు.
ట్యాంక్‌బండ్ వద్ద హుస్సేన్ సాగర్ (Hussain Sagar) అందాలు కనువిందు చేస్తుండగా.. మరోవైపు విగ్రహాలతో పాటు... చిన్నపాటి ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ మార్గంలో వాహనాల రాకపోకల వల్ల సందర్శకులు రోడ్డు దాటడం ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను ఇటీవల ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించాల్సిందిగా కేటీఆర్... హైదరాబాద్ పోలీసులకు కోరారు.
మంత్రి కేటీఆర్ సూచనలపై స్పందించిన సీపీ అంజనీ కుమార్... ప్రతి ఆదివారం వాహనాలను వేరే మార్గంలో మళ్లించాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక రచించారు. ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు వాహనాల రాకపోకలు పూర్తిగా దారి మళ్లిస్తున్నారు. లోయర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు మీదుగా వాహనదారులు రాకపోకలు కొనసాగించాల్సి ఉంటుంది. సందర్శకుల వాహనాలు మాత్రమే ట్యాంక్ బండ్ మీద 200 మీటర్ల లోనికి అనుమతిస్తారు. ఆ తర్వాత బారికేడ్లు వేసి... కేవలం కాలినడక ద్వారానే ట్యాంక్ బండ్‌పై తిరగాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: traffic Restrictions: ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు