సాధారణంగా వానాకాలంలో కూరగాయల పంటలు లక్షా 40 వేల ఎకరాల్లో వేయాలి. కరోనా వల్ల కూలీల కొరతతో కొందరు రైతులు మానుకున్నారు. హోటళ్లు, పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు డిమాండు అంతగా లేకపోవడంతో కొందరు ఇతర పంటల వైపు మళ్లారు. పత్తి, కంది పంటలు వేశారు. మరోవైపు కూరగాయల సాగుకు ప్రోత్సాహంగా ఉద్యానశాఖ రాయితీ విత్తనాలైనా ఇవ్వడం లేదు. ఈ సీజన్‌లో కూరగాయల పంటల సాగు 50 వేల ఎకరాలు తగ్గిందని, వర్షాలతో కొంత దెబ్బతిన్నాయని ఉద్యానశాఖ సంచాలకుడు ఎల్.వెంకట్రాంరెడ్డి తెలిపారు.
దిగుమతితో ధరల మంట
ఉత్తర్‌ప్రదేశ్ నుంచి క్యారెట్, ఆలుగడ్డలు, పశ్చిమ బెంగాల్ నుంచి దొండకాయలు, మహారాష్ట్ర నుంచి టమాటాలు, తమిళనాడు నుంచి మునగ, ఏపీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల నుంచి మరికొన్ని కూరగాయలు.. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు తెస్తుండడంతో లారీ కిరాయిలు, కూలీల రేట్లు పెరిగి ధరలు మండుతున్నాయి. శనివారం రైతుబజార్లలో బోడ కాకరకాయ రూ.105, పచ్చిమిరప, బీన్స్ రూ.60కి అమ్మినట్లు మార్కెటింగ్ శాఖ తెలిపింది. ఇక కాలనీల్లో బోడకాకరను రూ.120కి, పచ్చిమిరప, బీన్స్ రూ.80 నుంచి 100కి అమ్మారు. చిల్లర వ్యాపారులు రైతుబజార్లలో కన్నా 50 శాతానికి పైగా అధిక ధరలకు అమ్ముతున్నారని సామాన్యులు వాపోతున్నారు.