హైదరాబాద్ తొలి దశలో కొవిడ్ టీకా పొందడానికి అర్హులైన లబ్ధిదారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ(పీహెచ్‌సీ) తమ పేర్లు నమోదు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వెసలుబాటు కల్పించింది. మీ-సేవ, ఈ-సేవ తదితర సామాజిక సేవా కేంద్రాల్లోనూ వివరాలను నమోదు చేసేందుకు అవకాశమిచ్చింది. 50 ఏళ్లు దాటినవారు, 18-50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు.
తమ సమాచారాన్ని నమోదు చేసుకోవడానికి వీలుగా ఈ రెండు కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మండల స్థాయిలో వైద్యాధికారి పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బందే నమోదు ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అలా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, పురపాలక శాఖల ఉద్యోగుల జాబితాను కొవిన్ వెబ్యాప్ ద్వారా పొందుపరుస్తున్నట్టుగానే ఈ రెండు వర్గాల సమాచారాన్నీ ఆన్‌లైన్‌లో నమోదుచేయడానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
తెలంగాణలో 50 ఏళ్లు పైబడినవారు సుమారు 64 లక్షల మంది, 18-50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సుమారు 6 లక్షల మంది వరకూ ఉంటారని ఆరోగ్యశాఖ అంచనా వేసిన నేపథ్యంలో వారికి ఇది ఉపయుక్తంకానుంది.
అనేక తర్జనభర్జనల అనంతరం..
తొలి విడత టీకా తీసుకునే లబ్ధిదారుల్లో 50 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అధిక సంఖ్యలో ఉన్న క్రమంలో ఈ రెండు కేటగిరీల లబ్ధిదారులను గుర్తించడానికి ఓటరు కార్డు విధానాన్ని అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం తొలుత సూచించింది. ఇంత భారీ సంఖ్యలో లబ్ధిదారులను కేవలం ఓటరు కార్డు జాబితా ప్రాతిపదికన గుర్తించడం సవాలుతో కూడుకున్నదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.
కొవిన్ యాప్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే విధానాన్ని అనుసరించాలనే సూచనలను పంపింది. మరోవైపు యాప్ ద్వారా నేరుగా సమాచారాన్ని నమోదుచేసేంత అవగాహన ఎక్కువ మందిలో ఉండదని వైద్య వర్గాలు కేంద్ర సర్కారు దృష్టికి తీసుకెళ్లాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సర్కారు తాజాగా సరికొత్త విధానాలను ప్రవేశపెడుతున్నట్లుగా ప్రకటించింది. నాలుగు విధానాలు అందుబాటులోకి వచ్చినప్పుడు అర్హులైన వారి సమాచారాన్ని కొవిన్ యాప్‌లో పొందుపర్చడం సులభతరమవుతుందని వైద్యవర్గాలు తెలిపాయి.
సందేహముంటే 1075కు ఫోన్..
* పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఓటరు కార్డు, పాస్‌పోర్టు లేదా పుట్టిన తేదీని ధ్రువీకరించే మరే ఇతర అధికారిక ధ్రువపత్రాన్ని తీసుకెళ్లినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల్లో అక్కడి సిబ్బందే కొవిన్ వెబ్ యాప్‌లో సమాచారాన్ని పొందుపర్చుతారు.
* 18-50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తమ అనారోగ్యాన్ని ధ్రువపరుస్తూ వైద్యులు ఇచ్చిన చీటీని తీసుకెళ్లినా నమోదు చేస్తారు.
* ఈ క్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, సందేహాలున్నా 1075 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
2-3 రోజుల్లో రాష్ట్రానికి 6.5 లక్షల టీకాలు
కొవిడ్ టీకాలను ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. వీరందరికీ రెండు విడతలకు సరిపడా సుమారు 6.5 లక్షల డోసులు 2-3 రోజుల్లోనే రాష్ట్రానికి రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. రాష్ట్ర అతి శీతల గిడ్డంగిలో వీటిని భద్రపరుస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
టీకాల పంపిణీని వారం రోజుల్లోనే ప్రారంభిస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు పంపిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా యుద్ధప్రాతిపదికన టీకాలు అందించడానికి సన్నద్ధమైనట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. కొవిడ్ టీకాల పంపిణీకి అవసరమైన పరికరాలు, రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం రూ.480 కోట్లు మంజూరు చేసిందని, ఈ నిధులను రాష్ట్రాల వారీగా పంపిణీ చేస్తుందని తెలిపాయి.