రాష్ట్రంలో రెండోదశ కొవిడ్ పూర్తిస్థాయిలో పంజా విప్పకముందే.. సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏయే వర్గాలు నిత్యం ప్రజలతో మమేకమై ఉంటారో.. ఎక్కువ మందిని అనివార్యంగా కలవాల్సి వస్తుందో.. అటువంటి వారిని గుర్తించి, వారందరికీ టీకాలను వేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యమవుతుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ప్రతిపాదనలను పంపగా... కేంద్రం దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు తెలిపాయి. తద్వారా రాష్ట్రంలో మరో 20 లక్షల మంది వరకూ టీకాలను పొందడానికి అర్హత లభిస్తుందని వివరించాయి.
24 గంటలూ టీకాలే..
ప్రస్తుతం వైద్యసిబ్బంది, పోలీసులు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్ సిబ్బందికి వయసుతో సంబంధం లేకుండా ఇస్తున్నారు. 60 ఏళ్లు పైబడినవారికి, 45 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కుల్లోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా వేస్తున్నారు. వచ్చే నెల 1 నుంచి 45 ఏళ్ల పైబడిన వారందరికీ ఇవ్వనున్నారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 2000 కేంద్రాల్లో టీకాలను పంపిణీ చేయడానికి ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ టీకాలను వేయనుండగా.. ప్రైవేటులో స్థానిక పరిస్థితులు, మానవ వనరుల లభ్యతను దృష్టిలో పెట్టుకొని 24 గంటలూ టీకాలను ఇవ్వడానికి ఆరోగ్యశాఖ అనుమతించింది.
ఇదీ చూడండి: 'ప్రతి కొవిడ్ కేసుకు 25-30 మందిని గుర్తించాలి'