తెరాసలో సీఎల్పీ విలీనం అనేది తెలంగాణ సమాజానికి జరిగిన అవమానమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్ సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరించి తమ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఓ ఎస్సీ వ్యక్తిని ప్రతిపక్ష నాయకుడిగా చూడలేకపోయారని ఎద్దేవా చేశారు. సీఎల్పీ విలీనం వల్ల అసెంబ్లీలో హస్తం సంఖ్యాబలం తగ్గుతుంది తప్ప మరేమీ కాదని వెల్లడించారు. బలమైన శక్తిగా ఎదుగుతామని అన్నారు. తెరాస వైఖరికి నిరసనగా హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈనెల 8న ఇందిరా పార్కులో దీక్ష చేస్తామని పేర్కొన్నారు.
రాజ్యాంగ విరుద్ధం
తెరాసలో సీఎల్పీ విలీనం రాజ్యాంగ విరుద్ధమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ పాలన చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం ఉందా అని అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. దీనిపై తగిన రీతిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : స్పీకర్‌పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆగ్రహం