కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులను బలహీనపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆ చట్టాలను వ్యతిరేకించి రోడ్డెక్కిన తెరాస.. ఇప్పుడు మద్దతు పలుకుతుండటంతో భాజపా, తెరాసల చీకటి ఒప్పందం బయటపడిందని విమర్శించారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల నడ్డివిరుస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద సీఎల్పీ నేతలు చేపట్టిన రైతు దీక్షకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు వీహెచ్, మల్లు రవి, సిరిసిల్ల రాజయ్యలు హాజరై సంఘీభావం తెలిపారు.
రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని.. లేదంటే కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కులేదని ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని.. ఎల్లుండి అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేస్తామని వెల్లడించారు. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలుపు ఖాయమన్న ఉత్తమ్.. భాజపాకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఇచ్చేంత వరకు వరంగల్‌లో ప్రచారం చేసే అర్హత భాజపాకు లేదన్నారు.