కోవిడ్ నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కరోనా కట్టడి చర్యల్లో కాంగ్రెస్ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎవరికి వారు స్వీయ రక్షణ కల్పించుకుంటూ....అన్ని వర్గాలకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం ఉదయం 8 నుంచి రాత్రి 8గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. జిల్లాలు, పట్టణాల వారీగా 250 మంది కాంగ్రెస్ ముఖ్యనేతలతో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి... తద్వారా సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
ఎవరికి ఏ ఆపద వచ్చినా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా సహాయ సహకారాలు అందివ్వాలన్నారు. పదిరోజులపాటు లాక్‌డౌన్ అమలవుతున్నా... ఇంత వరకు బీపీఎల్ కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందలేదని ఆరోపించారు. 87లక్షల టన్నులు బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ 22లక్షల టన్నులు మాత్రమే పంపిణీ చేశారని తెలిపారు. ఈ విషయంపై రానున్న రెండు రోజుల్లో పంపిణీ తీరును పరిశీలించి గవర్నర్‌ను కలుస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఐఏఎస్ అధికారికి కరోనా- ప్రభుత్వం అప్రమత్తం