కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్(సీసీసీ)ను ఏర్పాటుచేయాలని కేంద్ర విద్యాశాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందులో విద్యావేత్తలు, ఇతర విద్యాపరమైన సమస్యలను పరిష్కరించే అధికారులను నియమించాలని మార్గదర్శనం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బడి మానేసే వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన కేంద్రం.. జూన్ 30వతేదీ వరకు సర్వే నిర్వహించి బడికి రాని వారిని గుర్తించి విద్యనందించాలని కోరింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కీలక పాత్ర వహించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. అభ్యసన నష్టాన్ని పూడ్చేందుకు, విద్యార్థి ఇంటి వద్ద చదువుకునేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించేలా చొరవ చూపాలని స్పష్టంచేసింది.
కమాండ్ సెంటర్ ఏర్పాటు లక్ష్యమిదీ...
పాఠశాలల్లో చేరిన/చేరని విద్యార్థులు, డ్రాపౌట్లు, బాలకార్మికులకు సంబంధించిన సమాచారం, పాఠ్య పుస్తకాల సరఫరా, ఉపాధ్యాయుల అందుబాటు, పాఠశాలల అవసరాలు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సీసీసీ నుంచి పర్యవేక్షణ ఉంటుంది. బడుల అవసరాలు, మెరుగైన బోధన అందించడంలో ఎదురయ్యే సమస్యలకు నిపుణులు పరిష్కారం చూపే వీలుంటుంది. ఇక్కడుండే విద్యావేత్తలు ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేయొచ్చు.
ఇంకా ఏమేం చేయాలంటే...
- విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ సందేహాలను, సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చేందుకు, వాటికి పరిష్కారం చూపేందుకు అనువుగా హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ప్రారంభించాలి.
- పాఠశాలలు, గ్రామాల వారీగా విద్యార్థుల హాజరుపట్టిక(రిజిస్టర్)ను తయారుచేయాలి. అందుకు తల్లిదండ్రులు, గ్రామ పంచాయతీ, ఉపాధ్యాయులతో కమిటీలు నియమించాలి. పిల్లలు ఏం చేస్తున్నారో నిత్యం తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాలను అందించి టీవీలు, యాప్స్, వాట్సాప్ ద్వారా బోధించే ఏర్పాట్లు చేయాలి.
- ప్రతి 10 మంది పిల్లలను ఒక ఉపాధ్యాయుడు పర్యవేక్షించాలి. ఆ పిల్లల అభ్యసన సామర్థ్యాల బాధ్యత ఆయనదే. పిల్లలతో నిరంతరం ఫోన్‌లో మాట్లాడుతూ వారికి అవసరమైన సూచనలు ఇవ్వాలి. వారి మానసిక స్థితిని అంచనా వేస్తూ తగిన సలహాలు ఇవ్వాలి.
- డిజిటల్ పాఠాల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన దీక్ష పోర్టల్‌ను అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు.
- బడులు తెరవని పరిస్థితులు తలెత్తే పక్షంలో స్మార్ట్‌ఫోన్/ల్యాప్‌ట్యాబ్/ ఇలాంటి ఉపకరణాలు లేని వారికి కూడా విద్య అందించే ప్రణాళిక ఉండాలి. గ్రామాల్లో చదువుకున్న యువతను వాలంటీర్లుగా నియమించుకుని చదువు చెప్పించాలి. స్వచ్ఛంద సంస్థలు, దాతల సాయం లేదా సీఎస్‌ఆర్ నిధులతో డిజిటల్ పాఠాలు వినేందుకు అవసరమైన పరికరాలు అందించేలా చూడాలి.
- టీవీల ద్వారా ప్రసారమయ్యే పాఠాలు వినలేని వారి కోసం వైబ్‌సైట్ రూపొందించాలి. ఆయా పాఠాలను అందులో నిక్షిప్తం చేయించి, అవసరమైనప్పుడు డౌన్‌లోడ్ చేసుకొని వినే సదుపాయం కల్పించాలి.
ఇదీ చూడండి: కరోనాతోనే జన్మించిన శిశువు- తల్లికి నెగెటివ్