కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)కి కేబినెట్ హోదా లభించింది. ఇవాళ్టి మంత్రివర్గ విస్తరణలో కిషన్ రెడ్డితో పాటు మరో ముగ్గురికి కేబినెట్ హోదా కల్పించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. కాసేపటి క్రితం విడుదలైన జాబితాలో కిషన్ రెడ్డితో పాటు కిరణ్ రిజిజు, హర్‌దీప్‌సింగ్ పూరీ, ఆర్.కె.సింగ్‌లకు కేబినెట్ హోదా కల్పించారు. సాయంత్రం విస్తరణ వేడుకలో వీరు మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
బండి సంజయ్ హర్షం
కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పించడంపై.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) హర్షం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన బండి సంజయ్ తెలంగాణ భాజపా శాఖ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
భాజపా (Bjp)లో కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి... అంచలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా, శాసనసభాపక్షనేతగా, ఎంపీగా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేసి విశేష సేవలందించారని కొనియాడారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని... అందుకు కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా ఇవ్వడమే నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేబినెట్ హోదా పదవి దోహదపడుతుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: BJP x JDU: కేంద్ర కేబినెట్ బెర్తుకు పోరు!