Kishan Reddy comments on KCR : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో శతాబ్ధకాలపు అభివృద్ధి బీఆర్‌ఎస్ నేతలకే జరిగిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి.. మాటలగారడీతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారులకు కాకుండా సలహాదారులకు పాలన అధికారాలను కట్టబెట్టి.. కేసీఆర్ దేశ్ కీ నేత అంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పాలనను గాలికి వదిలేసి మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ సభలు సమావేశాల పేరుతో తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం పంట బీమా అమలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో పంటల బీమాను అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. రైతులకు ఎరువులు భారం కాకుండా.. కేంద్రం యురియా వంటి ఎరువుల మీద సబ్సిడీ ఇస్తుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా ధరలు క్రమంగా పెరుగుతున్నా రైతులకు అందుబాటు ధరల్లోనే రాయితీపై అందిస్తున్నామన్నారు. ఒక యూరియా బస్తాపై రైతు కేవలం రూ.266 మాత్రమే చెల్లిస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వం రూ.2,142 రాయితీ ఇస్తోందన్నారు.
రైతులకు ఉచితంగా ఎరువులను ఇస్తానన్న కేసీఆర్.. ఒక్క హామీని అమలు చేయకుండా మహారాష్ట్రకు వెళ్లి మోదీని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు ఇస్తున్న సబ్సిడీ రైతులకే దక్కాలి.. దళారీలకు దక్కకుండా ఉండటమే మోదీ లక్ష్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చిన ట్రాక్టర్లను బీఆర్‌ఎస్ నేతలే పంచుకున్నారని విమర్శించారు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ పునరుద్ధరిస్తే.. ప్రారంభోత్సవానికి వచ్చే తీరిక కేసీఆర్‌కు లేకుండా పోయిందన్నారు. మహారాష్ట్ర, నాందేడ్‌లో జరిగే సభలు సమావేశాలకు వెళ్లడానికి మాత్రం సమయం దొరుకుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీ20కి సంబంధించి వందకు పైగా సమావేశాలు పూర్తి అయ్యాయని తెలిపారు. జూన్ 15,16,17 తేదీల్లో 20 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం హైదరాబాద్ వేదికగా జరగనుందన్నారు.
"కేసీఆర్ సలహాదారులకు పాలన అధికారాలను కట్టబెట్టి.. దేశ్ కీ నేత అంటూ తిరుగుతున్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది. కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి.. మాటల గారడీతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు". - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
ఇవీ చదవండి: