kishan reddy on agnipath: 'అగ్నిపథ్' పథకంపై అనవసరంగా రాజకీయం చేయొద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 'అగ్నిపథ్'తో దేశానికి మంచే తప్పా.. ఎవరికీ నష్టం జరగదని స్పష్టం చేశారు. 1999లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 'అగ్నిపథ్'కు బీజం పడిందని ఆయన తెలిపారు. అగ్నివీరులుగా ఒక్కసారి పనిచేస్తే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుందని, తద్వారా సైన్యం నుంచి బయటికి వచ్చాక బిజినెస్, ఉద్యోగాల్లోనూ మేటిగా రాణించవచ్చని పేర్కొన్నారు.
'అగ్నిపథ్'కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ఈ మేరకు మరోసారి స్పందించారు. 'సైన్యంలో పని చేయాలని చాలా మంది ఆశతో ఉన్నారు. అలాంటి వారు 'అగ్నిపథ్'లో చేరవచ్చు. అగ్నివీరులుగా చేరి.. బయటకు వచ్చిన తర్వాత ఎందులో చేరడానికైనా ఆ నైపుణ్యాలు ఉపయోగపడతాయి' అని కిషన్‌రెడ్డి వివరించారు. బయటికి వెళ్లాక అనేక విద్య, ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. మహీంద్ర లాంటి కంపెనీలు సైతం అగ్నివీరులందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయన్న ఆయన.. ప్రతిఒక్కరూ 'అగ్నిపథ్'కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
1999లో కాంగ్రెస్ హయాంలోనే 'అగ్నిపథ్'కు బీజం పడింది. అగ్నిపథ్‌పై అనవసరంగా రాజకీయం చేయొద్దు. అగ్నివీరులుగా పని చేస్తే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. సైన్యం నుంచి బయటకి వచ్చి ఉద్యోగం, వ్యాపారం చేసుకోవచ్చు. అగ్నివీరులకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయి. అగ్నిపథ్‌తో దేశానికి మంచి జరుగుతుంది, ఎవరికీ నష్టం లేదు.-కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
పరేడ్ గ్రౌండ్‌లో యోగా డే వేడుకలు: మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న యోగా దినోత్సవ ఏర్పాట్లను కేంద్రమంత్రి పరిశీలించారు. పరేడ్ మైదానంలో రేపు ఉదయం 5:30 గంటలకు యోగా దినోత్సవం ఉంటుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని స్పష్టం చేశారు. మైసూర్‌లో ప్రధాని మోదీ, కోయంబత్తూరులో రాజ్‌నాథ్‌సింగ్ యోగా దినోత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల్లో యోగాను తప్పనిసరి చేయాలని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి..
సాయి డిఫెన్స్ అకాడమీలో ఇంటెలిజెన్స్ అధికారుల తనిఖీలు
'అగ్నిపథ్'పై విపక్షాలు భగ్గు.. 'ఆర్మీ అధికారులతో ఆ పని చేయిస్తారా?'