Kishan Reddy Fires on CM KCR: సీఎం కేసీఆర్ కేంద్రంపై బురద జల్లుతున్నారని.. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలను వాడుకున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆక్షేపించారు. బడ్జెట్‌పై కేసీఆర్ ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను పొగుడుతూ, బీజేపీని విమర్శించారన్న ఆయన.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కేసీఆర్ సిద్ధహస్తుడని మండిపడ్డారు. నిన్నటి వరకు కమ్యూనిస్టులను తిట్టిన కేసీఆర్.. ఇప్పుడు వారితో జతకడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ దేశ పరిస్థితులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు దిల్లీలో మాట్లాడారు.
కేసీఆర్‌కు దమ్ముంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రెండు పడక గదుల హామీ, నిరుద్యోగ భృతిపై ఎందుకు చర్చ జరపలేదని నిలదీశారు. ఎస్సీలకు 3 ఎకరాల భూమిపై అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదన్నారు. ''కేసీఆర్ భజన.. మోదీపై విమర్శలు'' అసెంబ్లీలో జరిగింది ఇదే అంటూ విమర్శించారు. బీఆర్‌ఎస్ పెట్టుకున్నా ఉపయోగం లేదని ముఖ్యమంత్రికి అర్థమైందన్న ఆయన.. నిన్న సీఎం చెప్పిన తిరుమలరాయుని పిట్టకథ దేశంలో ఒక్క కేసీఆర్‌కు మాత్రమే వర్తిస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే దేశ ఆర్థిక పరిస్థితిపై తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపైనా కిషన్‌రెడ్డి స్పందించారు. రాజీనామా చేస్తానని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారని.. ఆరేడు నెలలు ఆగితే కేసీఆర్ రాజీనామా చేసే పరిస్థితి తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబ మంత్రులు.. నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారన్న ఆయన.. కేసీఆర్ చెప్పిన లెక్కలపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. చర్చకు ఎక్కడికి రమ్మంటారో కేసీఆర్ చెప్పాలన్నారు. ప్రగతిభవన్‌లోనైనా.. ఫామ్‌హౌస్‌లోనైనా.. కేసీఆర్‌తో చర్చకు ఎక్కడైనా సిద్ధమని సవాల్ విసిరారు.
''దేశ ఆర్థిక పరిస్థితిపై ఐఎంఎఫ్ ఏం చెప్పిందో కేసీఆర్ గూగుల్‌లో చూసి తెలుసుకోవాలి. కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్ చెప్పిన లెక్కలపై చర్చకు నేను సిద్ధం. చర్చకు ఎక్కడికి రమ్మంటారో చెప్పాలి. ప్రగతిభవన్‌లోనా.. ఫామ్‌హౌస్‌లోనా.. కేసీఆర్‌తో చర్చకు ఎక్కడైనా నేను సిద్ధం.''-కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
దేశ ఆర్థిక పరిస్థితిపై ఐఎంఎఫ్ ఏం చెప్పిందో కేసీఆర్ గూగుల్‌లో చూసి తెలుసుకోవాలని కిషన్‌రెడ్డి హితవు పలికారు. 2014లో తెలంగాణ అప్పు రూ.60 వేల కోట్లుంటే.. ఇప్పుడు రూ.5 లక్షల కోట్లు చేశారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ రూ.వేల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ దేశ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని.. దేశాన్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే అమెరికా అప్పు జీడీపీలో 120 శాతమని.. యూకే అప్పు డీజీపీలో 273 శాతమని.. ఇండియా అప్పు జీడీపీలో 19.9 శాతం మాత్రమే అని తెలిపారు. మన్మోహన్ కాలంలో దేశానిది 11వ స్థానమని.. మోదీ హయాంలో 5వ స్థానమని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి..
ఈ లెక్కలు అవాస్తవమైతే రాజీనామా చేస్తా: సీఎం కేసీఆర్
'మన్మోహన్ పాలనతో పోలిస్తే.. మోదీ హయాంలో దేశం ఘోరంగా దెబ్బతిన్నది'