Union Minister On Mahila Samman Savings Certificate: దేశంలో మహిళా సాధికారత కోసం మోదీ సర్కారు పెద్ద ఎత్తున చేపడుతున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళుతోందని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్సిన్హ్ జేసింగ్ భాయ్ చౌహాన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు కన్హా శాంతివనంలో జరిగిన 2023-24 సంవత్సరం సంబంధించి తెలంగాణలో ప్రత్యేక క్యాంపియన్‌లో భాగంగా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ రామచంద్ర మిషన్ ఛైర్మన్, ప్రపంచ ప్రఖ్యాత ధ్యాన గురువు డాక్టర్ కమలేశ్ డీ పటేల్- దాజీ సమక్షంలో కేంద్రం, తపాలా శాఖ ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ప్రత్యేక కవర్ కేంద్రమంత్రి విడుదల చేశారు. పలువురు మహిళలకు తపాలా శాఖ పొదుపు ఖాతా పాస్ పుస్తకాలు అందజేశారు.
మహిళా సమ్మాన్ పొదుపు పథకం: ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రాంతీయ పోస్టు మాస్టర్ జనరల్ పీ.విద్యాసాగర్, విశ్రాంత అటవీ శాఖ ఉన్నతాధికారి సక్సెనా, ఇతర తపాలా శాఖ అధికారులు పాల్గొన్నారు. శ్రీ రామచంద్ర మిషన్, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ, కన్హా శాంతి వనం ద్వారా విశేష సేవలందిస్తున్న కమలేశ్ పటేల్ ఇటీవల పద్మభూషణ్ పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఆయన పేరిట పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. మహిళా సమ్మాన్ పొదుపు పథకం మహిళలకు అత్యంత లాభదాయకమైన పెట్టుబడుల్లో ఒకటిగా ఈ సంవత్సరం ప్రారంభమైందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని భారతదేశం నలుమూలలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు లాలాజీ మహరాజ్ స్ఫూర్తితో గ్రామీణ పేదలు, ప్రత్యేకించి మహిళలు, యువతకు నైపుణ్యాలు పెంపు శిక్షణ, ఉపాధి అవకాశాలు, ధ్యానం, యోగా వంటి అంశాలపై కన్హా శాంతివనం అందిస్తున్న విశేస సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆ రోజుల్లోనే మహిళా సాధికారత లక్ష్యంతోపాటు వితంతువులకు పునర్వివాహాలు చేయించి కొత్త జీవితాలకు శ్రీకారం చుట్టే విధంగా ఓ ఉద్యమం తరహాలో సంస్కరణలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున చైతన్యం కల్పించారని గుర్తు చేశారు.
కన్హా శాంతి వనం సందర్శించడంతో జన్మధన్యమైంది: ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆధ్యాత్మిక తీర్థయాత్రల్లో ఒకటైన కన్హా శాంతివనం సందర్శించడం ద్వారా తన జన్మధన్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మారుతున్న కాలానుగుణంగా గ్రామీణ మహిళల్లో ఆర్థిక స్వాతంత్య్రం, ఆధ్యాత్మిక భావనలు ఎంతో అవసరమని దాజీ అన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచం పురోగమిస్తున్న వేళ పేదల్లో.. యువతలు, మహిళలను సైతం విద్య, గౌరవప్రదమైన వృత్తి వ్యాపకాలు, ఉపాధి, ఉద్యోగాల వైపు మళ్లిస్తే సమాజం మరింత పురోగమిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం సమావేశ మందిరంలో గంటపాటు దాజీ సామూహిక ధ్యానం చేయించారు.
ఇవీ చదవండి: