Respond to Bandi Sanjay: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇంకా నివేదిక ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు బండి సంజయ్ ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ .. ప్రివిలేజ్ కమిటీకి సమాధానమిచ్చింది. అక్రమంగా తనను అరెస్టు చేశారని లోక్‌సభ స్పీకర్‌కు బండి సంజయ్ ఫిర్యాదు చేయగా.. స్పీకర్ కార్యాలయం ప్రివిలేజ్ కమిటీకి పంపించింది. ఈ ఘటనపై ప్రివిలేజ్ కమిటీ .. కేంద్ర హోంశాఖను నివేదిక కోరగా.. తెలంగాణ ప్రభుత్వం ఇంకా వివరాలు ఇవ్వలేదని తెలిపింది. ఈనెల 21న లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ భేటీ కానుండగా.. సమావేశానికి బండి సంజయ్ హాజరుకానున్నారు.
ఏం జరిగింది?
Bandi Sanjay Arrest : ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పార్టీ కార్యాలయంలో జరుగుతున్న దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు కార్యాలయ గేటు తాళాన్ని పగలగొట్టారు. అప్పటికే లోపల ఉన్న శ్రేణులు... తమ నాయకుడిని అరెస్టు చేస్తే పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరించగా... ముందస్తు చర్యల్లో భాగంగా అగ్నిమాపక శకటాన్ని తెప్పించి కార్యాలయం లోపల నీళ్లు చల్లించారు. రాత్రి పదిన్నర గంటలకు తలుపులు, అద్దాలు బద్దలుకొట్టి.. లోపలికి వెళ్లి సంజయ్‌ను బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
అరెస్ట్ తీరును తప్పుపట్టిన హైకోర్టు
బండి సంజయ్‌ను అరెస్టు చేసిన తీరును తప్పుబట్టిన హైకోర్టు.. వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్‌ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. తన అరెస్ట్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బండి సంజయ్.. లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన దానిపై విచారణ జరపాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీని ఆదేశించారు. దీనిపై ఈనెల 21న కమిటీ భేటీ కానుంది. దీనికి బండి సంజయ్ కూడా హాజరుకానున్నారు.