నిరుద్యోగ భృతి అంశం మరోమారు తెరపైకి వచ్చింది. నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే భృతి ప్రకటిస్తారని పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3016 భృతి ఇస్తామని 2018 శాసనసభ ఎన్నికల్లో తెరాస హామీనిచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం నిరుద్యోగ భృతి అమలుపై కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నిరుద్యోగ భృతి పథకాలను అధికారులు అధ్యయనం చేశారు.
ఏడు రాష్ట్రాల్లో భృతి
మన దేశంలోని ఏడు రాష్ట్రాల్లో నిరుద్యోగ యువతకు భృతి ఇస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లో ఉంది. వివిధ రాష్ట్రాల్లో వివిధ విధానాలను అమలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 12వ తరగతి చదివి నిరుద్యోగులుగా ఉన్న 18 నుంచి 35 ఏళ్ల మధ్య యువతకు నెలకు వెయ్యి రూపాయల భృతి ఇస్తున్నారు. వికలాంగులైతే రూ. 500 అదనంగా ఇస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఛత్తీస్‌గఢ్ తరహాలోనే రూ.1000, రూ.1500 భృతి ఇస్తున్నారు. అయితే ఇక్కడ భృతి 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారికి మాత్రమే ఇస్తున్నారు.
వివరాలిలా....
కేరళలో ఎస్ఎస్సీఎల్ పాసైన మూడేళ్ల తరువాత నిరుద్యోగులుగా ఉన్న 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వారికి భృతి ఇస్తున్నారు. అక్కడ నెలకు కేవలం 120 రూపాయల భృతి మాత్రమే ఇస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో 12వ తరగతి, ఆపైన చదివి నిరుద్యోగులుగా ఉన్న 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారికి రూ. 1000, వికలాంగులైతే రూ. 1500 భృతిగా ఇస్తున్నారు. రాజస్థాన్‌లో 12వ తరగతి పాసై 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగ యువతకు భృతి ఇస్తున్నారు. అక్కడ పురుషులకు రూ.650, మహిళలకు రూ.750 భృతిని ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేషన్, రెండేళ్ల డిప్లమా పాసై నిరుద్యోగులుగా ఉన్న 22 నుంచి 35 ఏళ్ల యువతకు నెలకు రూ. 1000 భృతిగా ఇస్తున్నారు.
నిరుద్యోగులకు భృతి
హరియాణాలో 35 ఏళ్ల వయసు వచ్చే వరకు నిరుద్యోగులకు భృతి ఇస్తున్నారు. పదో తరగతి పాసైన వారికి రూ.100, 12వ తరగతి పాసైన వారికి రూ.900, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారికి రూ.1500 భృతిగా ఇస్తున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారికి రూ.3000 నిరుద్యోగ భృతిగా ఇస్తున్నారు. నిరుద్యోగ భృతికి వార్షిక ఆదాయ పరిమితి ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో రెండు లక్షల రూపాయలు కాగా... మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌లో మూడు లక్షల రూపాయలుగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అమలు విధానాలను అధికారులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు.
బడ్జెట్‌పై కసరత్తు
భృతి కోసం ఆయా రాష్ట్రాల్లో నిరుద్యోగులు ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్లో విధిగా నమోదు చేసుకుంటున్నారు. రికార్డులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం నిరుద్యోగుల సంఖ్య 9 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. అదే అంచనాతో 2019-20 బడ్జెట్లో రూ.1810 కోట్లను కేటాయించారు. విధివిధానాలు ఖరారు కాకపోవడంతో అది అమలు కాలేదు. ఉద్యోగాల కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో నమోదు చేసుకున్న వారి సంఖ్య 25 లక్షల వరకు ఉంది. అయితే అందులో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులతో పాటు.. ఇతరులు కూడా ఉంటారు.
2021-22 వార్షిక బడ్జెట్లో
రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఎవరికి ఇస్తారన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో నిరుద్యోగ భృతి విధివిధానాల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భృతి పొందే లబ్ధిదారుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఓ స్పష్టతకు రావాల్సి ఉంది. విద్యార్హతలు, వయస్సు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని విధివిధానాలు రూపొందించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలు, రాష్ట్రంలో పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మార్గదర్శకాలు ఖరారు చేయనున్నారు. 2021-22 వార్షిక బడ్జెట్ కసరత్తులో భాగంగా ఈ అంశంపై దృష్టి సారించవచ్చని అంటున్నారు. అందుకు అనుగుణంగా బడ్జెట్లో నిధుల కేటాయింపు చేయవచ్చని భావిస్తున్నారు.