శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కూడా మరికొంత సొమ్ము ఇస్తామని భరోసా ఇచ్చినా అవీ అందలేదు. దీంతో ఏకగ్రీవ పల్లెలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. 2019లో 12,680 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం ప్రకటించిన నజరానా కోసం అంతా కలిసి ఏకగ్రీవం చేసుకున్నారు. ఇలా 1,935 పంచాయతీల్లో ఏకగ్రీవాలయ్యాయి. రెండున్నరేళ్లు అవుతున్నా ఆ నిధులు మాత్రం రాలేదు. ఏకగ్రీవ సమయంలో సర్పంచి, పాలకవర్గం కలిసి గ్రామాలకు కొన్ని హామీలు ఇచ్చారు.
నామినేషన్ వేసిన వారు ఉపసంహరించుకునేందుకు తమ ప్రాంతంలో కొన్ని పనులు చేయాలన్న షరతు పెట్టారు. ప్రభుత్వం నుంచి నజరానా నిధులు అందగానే వాటిని పూర్తిచేయాలని కట్టుబాటు చేసుకున్నారు. అలా 1,935 పంచాయతీలకు రూ. 193.50 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. వాటితో రహదారులు, మురుగుకాల్వలు, వీధి దీపాలు తదితర సదుపాయాలను కల్పించుకుందాం అనుకున్నామని, ఎన్నికలై రెండున్నరేళ్లు అవుతున్నందున ఇచ్చిన మాట ప్రకారం పనులు చేయాలంటూ ప్రజలు ఒత్తిడి పెంచుతున్నారని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల అప్పులు తెచ్చి మరీ కొన్ని పనులు పూర్తి చేస్తున్నట్లు కొందరు పేర్కొంటున్నారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో 594 మంది జనాభాతో 2019లో బాసుతండా కొత్త పంచాయతీగా ఏర్పడింది. పాలకవర్గం ఏకగ్రీవమైంది. దీని పరిధిలో 4 తండాలు ఉన్నాయి. ఏకగ్రీవ నిధులు అందగానే పెద్దగుట్టపై నుంచి వరదనీరు రాకుండా సీసీ డ్రెయిన్ నిర్మించాలని, కొన్ని తండాల్లో సీసీ రోడ్లు, మురుగునీటి కాల్వలు నిర్మించాలని తీర్మానించుకున్నారు. ప్రభుత్వం నుంచి ఇతర నిధులు వస్తున్నా వాటి పనులు వాటికున్నాయి. నేడో.. రేపో నిధులు రావా అనుకుంటూ ప్రజలకు పాలకవర్గం సర్ది చెప్పుకుంటూ వస్తోంది. అనుకున్న పనులు పూర్తిచేయలేక పోవడంతో ఇబ్బందిగా ఉందని సర్పంచి సురేశ్ పేర్కొంటున్నారు.
కొత్త పంచాయతీలు విలవిల...
ప్రభుత్వం భారీ ప్రోత్సాహకం ప్రకటించడంతో కొత్తగా ఏర్పడిన పంచాయతీలు ఏకగ్రీవాల్లో ముందు నిలిచాయి. కొందరు సర్పంచులు, ఉప సర్పంచి, వార్డు సభ్యులు కూడా కొంత మొత్తాన్ని పంచాయతీకి ఇచ్చేలా మాట ఇచ్చారు. వీటితో గ్రామంలో ఏదైనా ఉపయోగకరమైన పనులు చేయాలని సంకల్పించిన పెద్దలకు ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. పంచాయతీ కార్యాలయం, బస్టాపు, సామూహిక వేడుకలకు వేదికలు, శ్మశానవాటికల్లో అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయాలని తీర్మానం చేసుకున్నారు. మాట ప్రకారం ప్రజాప్రతినిధులుగా నిలబడినవారు డబ్బులు ఇచ్చినా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పనులు పూర్తికాని పరిస్థితి ఏర్పడింది.
ఇదీచూడండి: Hyd Parking Problem: వాహనదారులకు శుభవార్త.. ఇక నుంచి పార్కింగ్ సమస్య లేనట్టే..!