హైదరాబాద్ రాజ్‌భవన్‌లో శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై దంపతులు.. తెలుగు ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. ప్లవ నామ సంవత్సరం బుద్ధిని, విజ్ఞానాన్ని సూచిస్తోందని.. కొత్త ఏడాది తెలుగు ప్రజల జీవితాల్లో గొప్ప శుభాలు కలిగించాలని తమిళిసై ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. గర్రెపల్లి మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరిగింది. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న నేతలు.. చీకట్లో నుంచి ప్లవ నామ సంవత్సరంలోని వెలుగులోకి అడుగు పెడుతున్నామని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ భవన్‌లో..
ఉగాదిని పురస్కరించుకుని హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం ఆధ్వర్యంలో పంచాంగశ్రవణం నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో దీపారాధన చేసిన పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ.. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు.
ఆలయాల్లో ఉగాది శోభ..
రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లోనూ ఉగాది శోభ సంతరించుకుంది. పండుగ రోజు స్వామివారిని దర్శించుకునేందుకు వరంగల్ వెయ్యి స్తంభాల ఆలయానికి భక్తులు తరలివచ్చారు. నగరానికి చెందిన ఓ భక్తుడు.. 21 కిలోల భక్షాలతో స్వామివారిని అలంకరించారు. భద్రాద్రి శ్రీ సీతారాములవారి ఆలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. గుడికి వచ్చిన వారికి ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: మే తర్వాత కరోనా ఉద్ధృతి తగ్గుతుంది: పంచాంగ శ్రవణం