Two arrested for deceiving people as GST officials: జీఎస్టీ కస్టమ్స్ అధికారులమంటూ ఇద్దరు వ్యక్తులు.. కొంత మంది అమాయకులను భారీగా మోసం చేశారు. రూ.28 కోట్లు వారి దగ్గర నుంచి దోచుకొన్నారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన నారాయణ గౌడ్(57), వరంగల్ జిల్లాకు చెందిన శైలజ(37) ఇద్దరు గత కొన్ని నెలలుగా పరిచయస్థులు. నారాయణకు జీఎస్టీ శాఖపై పట్టు ఉండటంతో ఇద్దరూ కలిసి జీఎస్టీ అధికారుల అవతారమెత్తారు.
నగరంలో పలు ప్రాంతాల్లో స్టీల్, సిమెంట్, గోల్డ్, లిక్కర్ వ్యాపారాలు చేసే వారి వద్దకు వెళ్లి తాను జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ నంటూ పరిచయం చేసుకునేవాడు. జీఎస్టీ లేకుండానే సామాగ్రి కొనుగోలు చేసి అధికంగా సంపాదించుకోవచ్చని ప్రజలను నమ్మించేవాడు. ఇతనితో పాటు శైలజను జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ అని పరిచయం చేశాడు. వీరి బుట్టలో పడ్డ కొంత మంది అమాయకులు సుమారు రూ.28 కోట్లను వివిధ రూపాల్లో వారికి సమర్పించుకున్నారు.
తర్వాత వారు కనబడకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాళ్లిద్దరూ నకిలీ అధికారులని బయటపడింది. నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారిపై అప్పటికే బాలానగర్లో 13 కేసులు నమోదైనట్లు డీసీపీ సందీప్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి వివరాలు అడిగితే మోసపోవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.
ఇవీ చదవండి: