దేశంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ రైల్వే. రైల్వే శాఖ అంటే.. అత్యంత సురక్షితమని ప్రయాణికులు భావిస్తుంటారు. రాను రాను రైల్వేశాఖపై ఆ అభిప్రాయం మారిపోతుంది. ఇటీవలి కాలంలో ఆగివున్న రైల్వే బోగీల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాది కాలంలో రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇంతకీ అవి ఎలా జరుగుతున్నాయి.. అనే దానిపై అధికారుల వద్ద స్పష్టమైన సమాధానం లేదు.
అప్పుడు అలా...
ఈ ఏడాది మార్చిలో మౌలాలీ రైల్వే స్టేషన్లో రైలులో అగ్నిప్రమాదం జరిగింది. మార్చి 13న కాకినాడటౌన్ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలును రాత్రివేళలో మౌలాలీ రైల్వేస్టేషన్‌లో నిలిపారు. మూడు బోగీలను మరమ్మతు నిమిత్తం తరలించేందుకు అదే రైలుకు తగిలించారు. మార్చి 14న ఆ బోగీల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ బోగీల తలుపులు తెరిచి ఉండడం వల్ల గుర్తు తెలియని దుండగులు బోగీల్లోకి చొరబడినట్లు రైల్వేశాఖ విచారణలో తేలింది. ఘటనా స్థలం నుంచి సిగరెట్ ముక్కలు, అగ్గిపెట్టె ఆనవాళ్లు సేకరించారు. ఇప్పటీకీ ఈ ఘటనపై అధికారికంగా నోరువిప్పడంలేదు.
ఇప్పుడు ఇలా...
తాజాగా మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో కొంతకాలంగా నిలిపి ఉంచిన పుష్‌పుల్ పాసింజర్ రైలుబోగిలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. గత 10 రోజులుగా ఈ బోగీలను ఇక్కడే నిలిపి ఉంచామని.. దీనికి ఇంజిన్ కూడా లేదని అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బోగీల నుంచి పొగలు రావడం వల్ల అప్రమత్తమైన సిబ్బంది... ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి కారణం గుర్తు తెలియని దుండగులా.. విద్యుదాఘాతమా అనేది తేలాల్సి ఉంది.
అధికారుల అలసత్వం వల్లనే..
గతంలో ఇలాంటి ఘటన జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు ప్రమాదాలపై దృష్టిసారించకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు.
ఇదీ చూడండి: మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం