Two arrested in Swapna Lok Complex Fire Accident case : స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో ఇద్దరు నిందితులను మహంకాళి పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మార్చి 16వ తేదీన సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ ఐదో అంతస్తులోని కేడియా ఇన్ఫోటెక్ సంస్థలో మొదట అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి మిగతా అంతస్తులకు వ్యాపించడంతో భవనంలో ఉన్న వారంతా ఉక్కిరి బిక్కిరయ్యారు. ఐదో అంతస్తులోని క్యూనెట్ సంస్థలో పనిచేస్తున్న నలుగురు యువతులు ప్రమీల, వెన్నెల, త్రివేణి, శ్రావణి.. ఇద్దరు యువకులు శివ, ప్రశాంత్ ప్రాణాలు కోల్పోయారు. కేడియా ఇన్ఫోటెక్, క్యూనెట్ సంస్థల నిర్లక్ష్యంతోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
బయటపడుతున్నకేడియా ఇన్ఫోటెక్ మోసాలు: ఈ ఘటనకు సంబంధించి అబిడ్స్‌కు చెందిన కేడియా ఇన్ఫోటెక్ నిర్వాహకుడు అశోక్ కేడియా (60), క్యూనెట్ సంస్థ సీఈవో శివ నాగ మల్లయ్య (30)లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో క్యూనెట్ సంస్థపై నిఘా పెట్టిన పోలీసులకు వారి దర్యాప్తులో మరికొన్ని విషయాలు బయటపడ్డాయి.
క్యూనెట్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు నిర్వహిస్తోందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే విషయంపై ఈ సంస్థలో పనిచేసిన ఉద్యోగులు రూ.లక్షల్లో నగదు చెల్లించామని మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం 30 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సంస్థ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఈ కేసును మహంకాళి పోలీస్ స్టేషన్ నుంచి నగర సీసీఎస్‌కు బదిలీ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ నెల 16న జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షలు పరిహారం అందజేశాయి. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. బాధితుల కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం మొదటగా బిల్డింగ్ సూపర్ వైజర్స్ నిర్లక్ష్యంగా పోలీసులు గుర్తించారు. అనంతరం షార్ట్ షర్కూట్ వల్ల జరిగి ఉంటుందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ సూపర్ వైజర్ ఫిర్యాదు మేరకు ఆ సంస్థపై పలు సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: