Twin towers for HODs near TS Secretariat : ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాల కోసం సమీకృత సముదాయం నిర్మించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా కసరత్తు జరుగుతోంది. సచివాలయానికి సమీపంలోనే జంటసౌధాల నిర్మాణానికి అనువైన స్థలాలు పరిశీలించాలన్న సీఎం ఆదేశాలతో యంత్రాగం స్థలాల అన్వేషణలో పడింది. సచివాలయం సమీపంలోని వివిధ ప్రభుత్వ స్థలాలను ఇందుకోసం పరిశీలిస్తున్నారు. ఆదర్స్‌నగర్‌లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, రిట్జ్‌హోటల్ ఉన్న ప్రాంతం, సికింద్రాబాద్ పాటిగడ్డలోని క్వార్టర్స్ స్థలం.. రెడ్‌హిల్స్‌లో స్థలం, ఎల్బీ స్టేడియం పరిసరాలను పరిశీలిస్తున్నారు.
CM KCR Plans To Build HOD Offices : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకోసం హిమాయత్‌నగర్‌లో కొత్త క్వార్టర్లు నిర్మించినందున ఆదర్శనగర్ క్వార్టర్స్.. చాలావరకు నిరుపయోగంగా ఉన్నాయి. అందులో చాలావాటి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. రిట్జ్ హోటల్ ప్రాంతం ఖాళీగా ఉండడంతో సినిమా షూటింగులు జరుగుతున్నాయి. వాటి వెనక ఉన్న లోకాయుక్త భవనం స్థలాన్ని.. అవసరమైతే ఉపయోగించుకోవచ్చని తద్వారా బషీర్‌బాగ్ వైపు రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అంటున్నారు.
పాటిగడ్డలో ఉన్న క్వార్టర్స్ పాతబడ్డాయి. చాలాక్వార్టర్స్‌లో ఎవరూ ఉండట్లేదు. అక్కడ స్థలంలభ్యత ఎక్కువగా ఉండటంతో హెచ్ఓడీ కార్యాలయాల నిర్మాణానికి ఆప్రాంతం అనువుగా ఉంటుందని అంటున్నారు. పాటిగడ్డ, నెక్లెస్‌రోడ్ మధ్య రైల్వేలైన్ ఉంది. ప్రస్తుతం పాటిగడ్డకు బేగంపేట రసూల్ పురా నుంచి మాత్రమే దారి ఉంది. ఒకవేళ హెచ్ఓడీ కార్యాలయాల సముదాయాన్ని అక్కడ నిర్మించాలని నిర్ణయిస్తే.. రైల్వేలైన్‌పై ఆర్ఓబీ నిర్మించి పీవీ నర్సింహారావుమార్గ్‌కి కలిపితే దూరం చాలా తగ్గడంతో పాటు ట్రాఫిక్‌కి పెద్దగా ఇబ్బంది ఉండవని అంటున్నారు. తద్వారా సికింద్రాబాద్, బేగంపేట నుంచి హుస్సేన్‌సాగర్, సచివాలయం వైపు రాకపోకలకు సులువుగా ఉంటుందని భావిస్తున్నారు.
CM KCR Is Planning To Build New HOD Offices Near Secretariat : ఎల్బీస్టేడియం పరిసరాలు, రెడ్‌హిల్స్‌లోని ప్రభుత్వ స్థలం సహా ఇతర ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కొన్ని హెచ్ఓడీ కార్యాలయాలను ప్రస్తుతం ఉన్న చోటే కొనసాగించాలన్న ఆలోచన ఉందని అంటున్నారు. పోలీస్, అటవీ, వైద్యారోగ్య, ఎక్సైజ్ తదితర కార్యాలయాలు సచివాలయానికి సమీపంలోనే ఉన్నందున వాటిని అక్కడే కొనసాగించడం మేలని, మిగతా వాటికి మాత్రం సముదాయం నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నట్లు తెలిసింది.
హెచ్ఓడీ కార్యాలాయాలన్ని ఒకేచోట కాకుండా సచివాలయం సమీపంలో రెండు, మూడుచోట్ల విడిగా నిర్మిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. అయితే సీఎం మాత్రం ఒకేచోట జంటసౌధాల వైపే మొగ్గుచూపుతున్నారు. అందులోభాగంగానే స్థల నిర్ధరణ తర్వాత జంటసౌధాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అవకాశం ఉన్న అన్ని స్థలాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని, ట్రాఫిక్ తదితర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని అంశాలపై అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి నివేదిస్తామని ఆ విషయంపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని యంత్రాంగం చెబుతోంది.
ఇవీ చదవండి: