TSRTC Twitter account hacked: ప్రస్తుత రోజుల్లో సైబర్ సెక్యూరిటీ ఎంత బలంగా ఉన్నా తరచూ కొందరి సోషల్ అకౌంట్లను హ్యాకర్లు హ్యాక్ చేస్తూనే ఉంటారు. సంస్థలు, ప్రముఖ వ్యక్తులు దీనికి అతీతమేమీ కాదు. ఇప్పుడీ ఖాతాలో టీఎస్ ఆర్టీసీ కూడా చేరింది. ఆదివారం రాత్రి 9:30 టీఎస్ఆర్టీసీ @tsrtcmdoffice ట్విటర్ ఖాతా హ్యాక్ అయినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించడానికి ట్విటర్‌తో కలిసి మాట్లాడామని.. ఇవాళ తెల్లవారుజామున సమస్య పరిష్కారమైందని వెల్లడించింది. ప్రస్తుతం ఆర్టీసీ ట్విటర్ ఖాతా యధావిధిగా పనిచేస్తుందని స్పష్టం చేసింది. ఆర్టీసీ ట్విటర్ ఖాతాను హ్యాక్ చేసిన వారిని మాత్రం ఇంకా గుర్తించలేదు.
ప్రయాణికుల నుంచి సూచనలు, సలహాలు, ఆర్టీసీలో ఎదురయ్యే ఇబ్బందులు, సంస్థ అభివృద్ధికి ఉపయోగపడే సలహాలు, సంస్థ లోపాలపై ఫిర్యాదులు సేకరించడానికి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విటర్ ఖాతాను ప్రారంభించారు. ఆర్టీసీ పరంగా ఏమైనా లోపాలు ఉంటే ట్విటర్ ఖాతా ద్వారా ఆన్లైన్ తెలియజేయవచ్చని గతంలో సూచించారు. ప్రస్తుతం లక్షా 13వేల 6 మంది ఈ ఖాతాను పాలో అవుతున్నారు.
ఇవీ చదవండి: