TSRTC Short Film contest: ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు టీఎస్ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఆర్టీసీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తాజాగా షార్ట్ ఫిల్మ్‌లు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తద్వారా ప్రయాణికులను ఆకట్టుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించేందుకు ఎంట్రీలను ఆహ్వానిస్తూ ఆర్టీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అద్భుతమైన షార్ట్ ఫిల్మ్‌లకు పురస్కారాలు అందించాలని అధికారులు నిర్ణయించారు.
ఆర్టీసీ అధికారులు ఎంపిక చేసిన వాటిలో మొదటిస్థానానికి రూ.10 వేలు, రెండోస్థానం రూ.5 వేలు, మూడోస్థానంలో నిలిచిన విజేతకు రూ.2500 పురస్కారం ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. సురక్షితమైన ప్రయాణం, లీటరు పెట్రోలు ధర కంటే తక్కువ మొత్తంతో రోజంతా నగరంలో సిటీ బస్సుల్లో తిరిగే అవకాశంపై అవగాహన కల్పించేలా షార్ట్ ఫిల్మ్‌లు తీయాలని అధికారులు సూచించారు.
పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఇంటికే ఆర్టీసీ బస్సు, ఆర్టీసీ కార్గో సేవలు, గరుడ, రాజధాని బస్సుల్లో సౌకర్యాలు వంటి తదితర అంశాలను మాత్రమే ఇతివృత్తంగా తీసుకుని షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందించాలని తెలిపారు. ఉత్సాహం ఉన్న వారు వివరాలతో ఈనెల 21 లోపు tsrtcshortfilm@gmail.com చిరునామాకు ఎంట్రీలు పంపాలని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్