TSRTC Special Offers: ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ అనేక సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా మరికొన్ని ఆఫర్లను తీసుకొచ్చినట్లు యాజమాన్యం పేర్కొంది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఇవాళ టీ-6, ఫ్యామిలీ-24 టికెట్ల పోస్టర్లను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ టికెట్లు శుక్రవారం నుంచి కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని సజ్జనార్ వివరించారు.
మహిళలు, సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం టీ-6 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని రూ.50 చెల్లించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ఆరు గంటల పాటు.. వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఆర్టీసీ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే.. టీ-6 టికెట్ చెల్లుబాటు అవుతుందని వివరించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ టికెట్‌ను బస్సుల్లో కండక్టర్‌లు ఇస్తారని పేర్కొంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత టీ-6 టికెట్లను మంజూరు చేయరని సంస్థ వెల్లడించింది.
60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు టీ-6 టికెట్ వర్తిస్తుందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఇందుకోసం టికెట్ తీసుకునే సమయంలో వయసు ధ్రువీకరణ కోసం వారు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. వారాంతాలు, సెలవు దినాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ప్రయాణించేందుకు వీలుగా ఫ్యామిలీ-24 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తెచ్చామని వివరించింది. ఈ టికెట్‌కు రూ.300 చెల్లిస్తే.. నలుగురు రోజంతా సిటీ ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించవచ్చని చెప్పింది. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రయాణం ఉచితం కాగా.. అంతకు పైబడిన వారు ఫ్యామిలీ-24 టికెట్ తీసుకోవచ్చని వెల్లడించింది. శని, ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో మాత్రమే ఈ ఆఫర్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
టీ-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన: ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగే బస్సుల్లో టీ-24 టికెట్‌ను సంస్థ అందజేస్తోంది. 24 గంటల పాటు ఆ టికెట్ చెల్లుబాటు అవుతుంది. దీని ధర పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.60గా ఉంది. దీనికి ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని యాజమాన్యం ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని తెలిపింది.
అందులో 55.50 లక్షల మంది.. టీ-24 టికెట్లను కొనుగోలు చేసినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం ప్రతి రోజు సగటున 25,000 వరకు ఇవి అమ్ముడవుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రయాణికులకు, పర్యాటకులకు మరింత చేరువయ్యేందుకు టీ-6, ఫ్యామిలీ-24 టికెట్లను తీసుకొచ్చినట్లు తెలిపింది. మహిళలు, సీనియర్ సిటిజన్స్, కుటుంబ సభ్యులు, స్నేహితులు వీటిని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది.
ఫ్యామిలీ-24తో ముగ్గురికి రూ.300: టీ-24 టికెట్ అయితే నలుగురు రూ.400 చెల్లించాల్సి ఉంటుందని.. కానీ ఫ్యామిలీ-24తో రూ.300 చెల్లించి నలుగురు ప్రయాణం చేయవచ్చని సజ్జనార్ తెలిపారు. టీ-24 టికెట్ మాదిరిగానే వీటిని ప్రజలు ఆదరించాలని కోరారు. ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసమే టీ-6, ఫ్యామిలీ-24 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చామని స్పష్టం చేశారు. వీటి ద్వారా తక్కువ ఛార్జీలతోనే హైదరాబాద్ నగరంలో ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లో సంప్రదించాలని ఆయన సూచించారు.
ఇవీ చదవండి: టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!
లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకే 'మహిళా రిజర్వేషన్' నాటకం: కిషన్‌రెడ్డి
అంబులెన్స్ కొన్న 'ఛాయ్‌వాలా'.. ఉచితంగా సేవలు.. అందుకోసమేనట!