ఆర్టీసీ కార్మికులకు కొవిడ్-19 ప్రావిడెంట్ ఫండ్ రుణాలు చెల్లించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. కేంద్రం మార్చి నెలలో ఉద్యోగులకు, కార్మికులకు ఈపీఎఫ్ స్కీమ్‌లో 68 ఎల్(3)లో నూతన ప్రొవిజన్ చేర్చి కార్మికుల పీఎఫ్ మొత్తాల నుంచి పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ మేరకు వేలాది మంది ఆర్టీసీ కార్మికులు ఈపీఎఫ్ రుణాలకు దరఖాస్తు చేసుకున్నా.. నేటికీ రుణాలు మంజూరు కాలేదని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు రుణాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు.